YS Viveka Murder Case: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో మూడో సారి సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు అవినాష్ రెడ్డి. నిన్న హైకోర్టులో ఆయన సీబీఐ నోటీసులపై రిట్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇవేళ విచారణకు హజరు అవుతారా లేదా అనే సందేహాలు తలెత్తాయి. ఈ రోజు హైకోర్టులో అవినాష్ పిటిషన్ పై విచారణ జరగనున్న నేపథ్యంలో అనూహ్యంగా ఆయన విచారణను ఎదుర్కొనేందుకు సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ రోజు 11 గంటల నుండి అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు.

ఇప్పటికే ఆయనను సీబీఐ అధికారులు జనవరి 28, ఫిబ్రవరి 24 తేదీల్లో రెండు సార్లు విచారణ చేసి ఆయన నుండి స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. మూడో సారి విచారణ నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టు హైకోర్టును ఆశ్రయించారని భావిస్తున్నారు. అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ లో సీబీఐ దర్యాప్తు తీరుపై ఆరోపణలు చేశారు. ఈ తరుణంలో సీబీఐ అధికారులు ఏ విధంగా స్పందిస్తారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిలను తొలుత ఈ నెల 6వ తేదీన విచారణ చేయాలని సీబీఐ నిర్ణయించింది. ఆ మేరకు వారికి నోటీసులు జారీ చేయగా, ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల హజరు కాలేనని అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు.

దీంతో సీబీఐ అధికారులు 10వ తేదీన హజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఇదే క్రమంలో ఆయన తండ్రి భాస్కరరెడ్డిని 12వ తేదీ కడపలో విచారణకు హజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసినందున సీబీఐ బలవంతపు చర్యలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ అవినాష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ జరిపే విచారణను మొత్తం ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని, విచారణ సమయంలో న్యాయవాదిని అనుమతించాలని అవినాష్ రెడ్డి కోరారు. ఇదే సందర్భంలో సీబీఐ అధికారుల దర్యాప్తు తీరును తప్పుబడుతూ వారిపై ఆరోపణలు చేశారు. అవినాష్ రెడ్డి పిటిషన్ పై ఇవేళ హైకోర్టులో విచారణ జరగనున్నది.