YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు లో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో అవినాష్ రెడ్డిని సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ నేతృత్వంలోని బృందం సుమారు నాలుగున్నర గంటల పాటు విచారణ జరిపింది. సీబీఐ కార్యాలయం నుండి బయటకు వచ్చిన తర్వాత అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

సీబీఐ అధికారులు ఇచ్చిన 160 సీఆర్పీసీ నోటీసుల ప్రకారం విచారణకు హజరయ్యాననీ, విచారణ పారదర్శకంగా జరగాలని తాను సీబీఐ అధికారులను కోరినట్లు చెప్పారు అవినాష్ రెడ్డి. అధికారులు అడిగిన ప్రశ్నలకు తమకు తెలిసినంత వరకు సమాధానాలు ఇచ్చానన్నారు. సీబీఐ అధికారులకు ఉన్న అనుమానాలను సమాధానాలతో నివృత్తి చేశానని తెలిపారు. మరల అవసరమైతే కొద్ది రోజుల్లో విచారణకు పిలుస్తామని చెప్పారనీ, మళ్లీ ఎప్పుడు విచారణకు రమ్మన్నా వస్తానని తెలిపానన్నారు. నాలుగు గంటల పాటు తనను విచారించారని చెప్పారు. విచారణకు సంబంధించిన విషయాలు ఏవీ ఇప్పుడు బహిర్గతం చేయలేనన్నారు.
ప్రజలకు కేసుకు సంబంధించి వివరాలు తెలియాలని వీడియో, ఆడియో అనుమతి కోరాననీ, తనతో పాటు న్యాయవాదిని అనుమతించాలని కోరాననీ, అయితే అందుకు సీబీఐ విచారణ అధికారి అంగీకరించలేదని తెలిపారు అవినాష్ రెడ్డి. కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని తమపై దుష్ప్రచారం చేస్తున్నాయని అవినాష్ రెడ్డి అన్నారు. మొదటి సారి అవినాష్ రెడ్డి సీబీఐ కార్యాలయానికి విచారణకు హజరు కావడంతో పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు అక్కడకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కోటి సీబీఐ కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.