మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో చంచల్ గుడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి అస్వస్థతకు గురైయ్యారు. శుక్రవారం ఆయనకు ఉన్నట్టుండి బీపీ పెరగడంతో జైలు సిబ్బంది వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. కాగా ఉస్మానియా వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం భాస్కరరెడ్డిని రేపు నిమ్స్ కు జైలు అధికారులు తరలించనున్నారు. కాగా ఇప్పటికే అవినాష్ రెడ్డి శ్రీలక్ష్మి అస్వస్థతకు గురై ఈ నెల 19వ తేదీ నుండి కర్నూలులోని ఆసుపత్రిలో చికిత్స పొందారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాద్ లోని ఏఐజీ తరలించారు. ప్రస్తుతం ఆమెకు కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో అవినాష్ రెడ్డి కూడా ఏఐజీ ఆసుపత్రిలోనే ఉన్నారు.

మరో పక్క అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోంది. అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది, సునీత తరపు న్యాయవాది తమ వాదనలు పూర్తి చేయగా, సీబీఐ వాదనల కోసం న్యాయమూర్తి విచారణను రేపటికి వాయిదా వేశారు. తల్లి అనారోగ్యంతో ఉండటంతో ఈ నెల 19, ఆ తర్వాత 22 తేదీల్లో సీబీఐ విచారణకు గైర్హజరు అయ్యారు వైఎస్ అవినాష్ రెడ్డి. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి అరెస్టునకు సీబీఐ అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తొలుత సుప్రీం కోర్టులో, ఆ తర్వాత హైకోర్టులో విచారణ జరుగుతుండటంతో సీబీఐ ముందడులు వేయలేదు.