ఏపిలో జనసేన వర్సెస్ ముద్రగడ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగుతోంది. పెద్ద ఎత్తున జనసైనికులు, అభిమానులు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. సభల్లో పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేయడంతో పాటు ఇతర వర్గాలతో పాటు కాపుల సంక్షేమం గురించి కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ తరుణంలో పవన్ మాట్లాడుతున్న భాషపై మాజీ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇప్పటికే ఒక సారి పవన్ కు బహిరంగ లేఖ విడుదల చేశారు. ముద్రగడ బహిరంగ లేఖపై జనసైనికులు సోషల్ మీడియా వేదికగా ముద్రగడకు విమర్శలు గుప్పించారు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన ముద్రగడ పద్మనాభం తాజాగా మరో లేఖ రాశారు.

మరో మూడు పేజీల లేఖలో 30 ప్రశ్నలను సంధిస్తూ.. వాటికి సమాధానం చెప్పాలో వద్దో నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ కే వదిలివేస్తున్నట్లు పేర్కొన్నారు. కాకినాడ నుండి కాకుంటే ఫిఠాపురం నుండి పోటీ చేయగలరా.. చేస్తే తనను పోటీకి రమ్మని సవాల్ చేయగలరా అని ముద్రగడ ప్రశ్నించారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో పాటు తనను కూడా తిట్టించడంపై ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు. మీ అభిమానుల చేత బండ బూతులతో మెస్సేజ్ లు పెట్టిస్తున్నారు. ఆ మెస్సేజ్ లకు భయపడిపోయి నేను లొంగుబాటుకు వస్తానని అనుకుంటున్నారేమో అది ఈ జన్మకు జరగదు. అలా పెట్టించడం వల్ల మీరు పెద్ద హీరో అనుకుంటున్నారు. సినిమాలో హీరో తప్ప రాజకీయాల్లలో హీరో కాదన్నది గ్రహించాలన్నారు. తన అభిప్రాయాలు చెప్పకుండా పవన్ కు తొత్తుగా ఉండాలా అంటూ ముద్రగడ ప్రశ్నలు సంధించారు.
తాజాగా లేఖలో పవన్ కు ముద్రగడ సంధించిన ప్రశ్నలు ఇవే
- నన్ను మీరు, మీ అభిమానులు ఎందుకు తిడుతున్నారు..?
- నేను మీ దగ్గర నౌకరునా?
- నేను మీకు తొత్తులుగా ఉండాలా?
- నాకు సొంత అభిప్రాయాలు ఉండకూడదా?
- మీరు ఏమన్నా పడతానన్న గర్వమా?
- వంగవీటి రంగా హత్య అనంతరం ఎంతో మంది అమాయకులను జైలులో పెట్టారు వారిని పలకరించారా?
- వాళ్ల కుటుంబాలను ఏ రోజైనా పలకరించారా?
- జైలులో ఉన్న వాళ్లకు బెయిల్ ఇప్పించేందుకు ప్రయత్నించారా?
- 1988 నాటి కాపు కేసులపై అప్పటి సీఎంతో మాట్లాడారా?
- 1993 లో కాపులను చావబాదిన వ్యవహారంపై స్పందించారా?
- 1994 లో కాపు ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని కోరారా?
- 2016 తుని ఘటన బాధితులను పరామర్శించారా?
- తుని ఘటన కేసులను జగన్ ఎత్తివేసినట్లు మీకు తెలీదా?
- కాపు కులాన్ని నేను స్వార్దం కోసం వాడుకుంటున్నానా?
- గోచీ మొలతాడు లేని వాళ్లతో తిట్టిస్తే ఏం లాభం?
- కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉందా?
- జిల్లాకు అంబేద్కర్ పేరు విషయమై కాపులపై కేసులు లేవా?
- నిత్యం మిమ్మల్నే స్మరించేవారి కోసం మీ రెందుకు వెళ్లరు?
- మీ కోసం అందరూ రోడ్డు మీదికి రావాలా?
- రోడ్డు మీదకు వచ్చినవారికి ఆపదొస్తే పట్టించుకోరా?
- మీ సినిమాలు విడుదలైతే ఫ్యాన్స్ కు వేలాది రూపాయల ఖర్చెందుకు?
- నన్ను పోలీసులు బూటుకాళ్లతో తన్నినప్పుడు మీరెక్కడ?
- మీ బాంచెన్ దొర అనకపోతే నన్ను తిడతారా?
- నా ఫ్యామిలీని బూతులు తిడితే మీరేమైపోయారు?
- కాకినాడ ఎమ్మెల్యేతో కలిపి నన్నెందుకు తిట్టారు?
మీ వాళ్లతో తిట్టించి నన్ను పోటీకి లాగుతున్నారా..? అంటూ పలు ప్రశ్నలను సంధించారు ముద్రగడ. అయితే ముద్రగడ లేఖపై పవన్ కళ్యాణ్ స్పందించి సమాధానాలు ఇస్తారా లేక మరో బహిరంగ సభలోనే ఈ అంశంపై మరిన్ని విమర్శలు చేస్తారా అనేది వేచి చూడాలి.
ఏపి సర్కార్ ప్రవేశపెట్టిన మరో బృహత్తర కార్యక్రమం జగనన్న సురక్ష .. జూలై 1 నుండి ప్రత్యేక క్యాంపులు
ముద్రగడ లేఖ: Namaste Andi, Mudragada Padmanabham 3