టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని తో మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు భేటీ అంశం ఓ పక్క రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా ఉండగానే మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ (కేపి) తాజాగా నేటి రాజకీయాలపై చేసిన కీలక వ్యాఖ్యలు తీవ్ర సంచలనం అయ్యాయి. ఈ రోజుల్లో రాజకీయం చేయాలంటే పది మంది పోరంబోకులు వెంట ఉండాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తన నియోజకవర్గ పరిధిలోని చంద్రాల సొసైటి శంకుస్థాపన సభలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. మూడున్నరేళ్లలో ఎవరిపైనా అక్రమ కేసులు బనాయించలేదనీ, ఎవరికీ సంక్షేమ పథకాలు ఆపలేదని అన్నారు. అక్రమ కేసుల విషయంలో కొందరు నేతలకు తనపై అసంతృప్తి ఉందని తెలిపారు.

పది మంది రౌడీలను వెంటేసుకుని తిరగడం చేతగాక, పాత తరం నాయకుడిలా మిగిలిపోయానంటూ కేపి వ్యాఖ్యానించారు. 55 సంవత్సరాలుగా తమ తమ కుటుంబం రాజకీయాల్లో ఉందనీ, అప్పటి రాజకీయాలతో పోలిస్తే ఇప్పటి రాజకీయాలు గణనీయంగా మార్పు చెందాయని అన్నారు కేపి. పోరంబోకులను వెంటేసుకుని తిరిగితేనే ముందుకు వెళ్లే పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈ పరిస్థితులు చూస్తుంటే ఒక్కో సారి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా అని బాధపడుతున్నానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కేపి. ఎమ్మెల్యేగా ఉండి కూడా సగటు వ్యక్తులకు సహాయం కూడా చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్ ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రస్తుత రాజకీయాల పట్ల అసంతృప్తితోనే ఈ వ్యాఖ్యలను కేపి చేసినట్లుగా ఉందని భావిస్తున్నారు. రీసెంట్ గా గుంటూరులో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మృతి చెందగా, కార్యక్రమ నిర్వహకుడు, ఎన్ఆర్ఐని అరెస్టు చేసిన సందర్భంలోనూ కేపి స్పందించారు. సేవా కార్యక్రమాలు చేసే వారిని విమర్శించడం సరికాదని అన్నారు. ప్రజలకు సేవ చేయాలనుకునే ఎన్ఆర్ఐలను ఆపడం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వహకుడు, ఎన్ఆర్ఐ ఉయ్యూరు శ్రీనివాస్ తనకు మంచి స్నేహితుడని, చాలా మంచి వ్యక్తి అని కేపి మాట్లాడారు. నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ వర్గంతో విభేదాల నేపథ్యంలో కేపి కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్ననే టీడీపీ ఎంపీ కేశినేని నానితో కేపి తండ్రి మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు భేటీ కావడం, ఈ రోజు కేపి సంచలన కామెంట్స్ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
టీడీపీ ఎంపీ కేశినేని నానితో మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు భేటీ..మ్యాటర్ ఏమిటంటే..?