సినీ హీరో నందమూరి తారకరత్న (40) కన్నుమూశారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయా ఆసుపత్రిలో 23 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన కొద్ది సేపటి క్రితం తుది శ్వాస విడిచారు. గత నెల 26వ తేదీన టీడీపీ యువనేత నారా లోకేష్ కుప్పం నుండి ప్రారంభించిన యువగళం పాదయాత్రలో పాల్గొనేందుకు వెళ్లిన తారకరత్న.. పూజా కార్యక్రమాల అనంతరం హాఠాత్తుగా గుండె పోటుకు గురై కుప్పకూలిన సంగతి తెలిసిందే.

నాడు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణా హృదయాలయా ఆసుపత్రికి తరలించారు. గత 23 రోజులుగా తారకరత్నకు అక్కడే చికిత్స అందిస్తున్నారు. ఆయనను కాపాడేందుకు విదేశీ వైద్యబృందం వచ్చి వైద్యసేవలు అందించారు. అయినప్పటికీ ఆ ప్రయత్నం ఫలించలేదు. తారకరత్నకు భార్య అలేఖ్య రెడ్డి, ఓ కుమార్తె ఉన్నారు. తారకరత్న ఆరోగ్యం విషమంగా ఉందని ఇవేళ ఉదయం తెలియడంతో నందమూరి బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు హుటాహుటిన బెంగళూరుకు చేరుకున్నారు.
నందమూరి మోహనకృష్ణ తనయుడైన తారకరత్నకు చిన్ననాటి నుండి సినిమా లంటే ఇష్టం. బాలకృష్ణ ప్రోత్సాహంతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఒకటో నెం. కుర్రాడు చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు. దాదాపు 20 చిత్రాల్లో హీరోగా నటించారు. పలు చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్రలోనూ ప్రేక్షకులను మెప్పించారు. అమరావతి సినిమా ఆయనకు ఉత్తమ విలన్ గా నంది అవార్డు తీసుకువచ్చింది. కాగా తారకరత్న భౌతికాయాన్ని హైదరాబాద్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తారకరత్న మృతితో నందమూరి, నారా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు తారక రత్న మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.
వివాహ వేడుకల్లో కొత్త సంస్కృతి.. ప్రజలపై కరెన్సీ వర్షం..ఎక్కడంటే..?