ముఖ్యమంత్రి కుమారుడుగా, మంత్రిగా అధికారాన్ని అనుభవిస్తూ కూడా గత ఎన్నికల్లో నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి వైసీపీ అభ్యర్ధి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో పరాజయం పాలైయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలిలో టీడీపీలోని అతిరథ మహారధులు కూడా ఓటమి పాలైయ్యారు. వారిలో నారా లోకేష్ కూడా చేరిపోయారు. అయితే ఓటమితో మనోధైర్యం కోల్పోకుండా నారా లోకేష్ మళ్లీ మంగళగిరి నియోజకవర్గం పైనే ఫుల్ ఫోకస్ పెట్టారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం చేయడం కోసం తరచు నియోజకవర్గంలో పర్యటిస్తూ అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో రాబోయే ఎన్నికల్లో ఇక్కడి నుండే పోటీ చేసి గెలిచి పార్టీ అధినేత చంద్రబాబు కు గిఫ్ట్ గా ఇస్తానని ప్రకటించారు నారా లోకేష్.

వాస్తవానికి మంగళగిరి నియోజకవర్గం టీడీపీకి మొదటి నుండి వీక్. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1983,85 ఎన్నికల్లో మాత్రమే టీడీప అభ్యర్ధి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు విజయం సాధించారు. ఆ తర్వాత 1989 నుండి జరిగిన ఎన్నికల్లో ఒక సారి సీపీఎం, నాలుగు సార్లు కాంగ్రెస్, రెండు సార్లు వైసీపీ గెలిచింది. అయితే 2014 ఎన్నికల్లోనూ మాత్రమే వైసీపీకి టీడీపీ గట్టి పోటీ ఇచ్చింది. కేవలం 12 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్ధి గంజి చిరంజీవి వైసీపీ అభ్యర్ధి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో పరాజయం పాలైయ్యారు. ఈ కారణంతో నారా లోకేష్ రాజధాని పరిధిలోని మంగళగిరిని ఎంచుకుని 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. 5,300 ఓట్ల తేడాతో ఓటమి పాలైయ్యారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకురావడంతో ఆ ప్రభావంతో మంగళగిరి నియోజకవర్గంలో ప్రభుత్వంపై వచ్చే వ్యతిరేకతతో ఈజీగా గెలవవచ్చని లోకేష్ భావించి 2024లోనూ ఇక్కడ నుండి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు.

అయితే లోకేష్ ను రెండో సారి కూడా ఓడించాలన్న లక్ష్యంతో వైసీపీ రకరకాల వ్యూహాలను పదును పెట్టింది. అమరావతిలో తమ పట్టును నిలబెట్టుకోవడానికి, లోకేష్ ను ఓడించి మనసికంగా దెబ్బతీయడానికి జగన్మోహనరెడ్డి ద్విముఖ వ్యూహాన్ని రచించినట్లు కనబడుతోంది. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఆళ్ల రామకృష్ణారెడ్డికి గట్టి పోటీ ఇచ్చిన గంజి చిరంజీవిని వైసీపీలోకి చేర్చుకుని జగన్ నామినేటెడ్ పదవి ఇచ్చారు. ఈ నియోజకవర్గంలో అభ్యర్ధుల గెలుపు ఓటములను నిర్దేశించే సామాజికవర్గం చేనేత ఓటర్లు. ఈ సామాజికవర్గానికి చెందిన ముఖ్యనేత మురుగుడు హనుమంతరావుకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. అవసరమైతే నారా లోకేష్ ను ఓడించేందుకు మరో బలమైన అభ్యర్ధిని రంగంలోకి దింపడానికి వైసీపీ యోచన చేస్తుందని కూడా వార్తలు వినబడ్డాయి.
అంతే కాకుండా మూడు రాజధానుల కాన్సెప్ట్ ప్రభావంతో రాజధాని ప్రాంతంలో జరుగుతున్న మైనస్ ఓట్లకు ప్రత్యామ్నాయంగా ఆర్ – 5 జోన్ లో 50 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేసింది జగన్ సర్కార్. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు చెందిన 50 వేల కుటుంబాలకు ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. వీరంతా మంగళగిరి నియోజకవర్గ ఓటర్లుగా త్వరలో మార్చే ప్రక్రియను కూడా అధికార పార్టీ చేపడుతుంది. దీంతో ఒక్కో కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు చొప్పున వేసుకున్నా లక్షకుపైగా ఓట్లు వైసీపీ ఖాతాలో పడినట్లే భావించాల్సి ఉంటుంది.

ఈ పరిణామాల క్రమంలో లోకేష్ ఇక్కడ ఎంత కష్టపడినా ఉపయోగం ఉండదనే మాట ఆ పార్టీ నేతల్లోనే వ్యక్తం అవుతోంది. వైసీపీకి మాత్రం గెలుపు నల్లేరుపై నడకే అని చెప్పవచ్చు. అందుకే లోకేష్ కు ఆ పార్టీ ప్రత్యామ్నాయ నియోజకవర్గాలను ఎంపిక చేసి ఉంచిందని అంటున్నారు. అందులో భాగంగా గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు, విశాఖ టౌన్ లేదా రూరల్ లో గానీ, అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గాలను పార్టీ నేతలు పరిశీలించి ఓకే చేశారని భావిస్తున్నారు. మంగళగిరిలో పోటీ చేసి రిస్క్ తీసుకోవడం కంటే ఈ మూడు నియోజకవర్గాల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకుంటే బాగుంటుంది అని పార్టీ లోని సీనియర్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారుట. సీనియర్ ల అభిప్రాయాన్ని చంద్రబాబు ఏకీభవిస్తున్నా లోకేష్ ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
హస్తినలో బిజీబిజీగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ..ముగ్గురు కేంద్ర మంత్రులతో భేటీ