Tarakaratna: సినీ నటుడు నందమూరి తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తారకరత్న ఆరోగ్య పరిస్థితి పై ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ ను తాజాగా విడుదల చేశాయి. తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు హెల్త్ బులిటెన్ లో వైద్యులు వెల్లడించారు. కార్డియాలజిస్ట్ లు, ఇంటెన్సివిస్ట్ లతో సహా మల్టీ డిసిప్లినరీ క్లినికల్ టీమ్ తారకరత్న ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంటకు రోడ్డు మార్గంలో కుప్పం నుండి తారకరత్నను అంబులెన్స్ లో నారాయణ హృదయాలయకు తరలించారు.

మయో కార్డియల్ ఇన్ఫార్ఖన్ తర్వాత కార్డియోజెనిక్ షాక్ కారణంగా ఆయన పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని వైద్యులు హెల్త్ బులిటెన్ లో తెలిపారు. ఎక్మో వైద్య విధానం ద్వారా తారకరత్నకు కృతిమంగా శ్వాసనందిస్తున్నట్లు తెలిపింది. బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తాన్ని పంపింగ్ చేసేందుకు వైద్యులు ప్రయత్నం చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ ఆసుపత్రిలో ఉండి కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్నారు. తారకరత్నను పరామర్శించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు బెంగళూరుకు చేరుకున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొనడానికి నిన్న కుప్పం వెళ్లి తారకరత్న అస్వస్థతకు గురైయ్యారు. కుప్పం లక్ష్మీపురంలో మసీదులో ప్రార్ధనలు అనంతరం బయటకు వస్తున్న సమయంలో తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే పార్టీ శ్రేణులు ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తొలుత అలసట కారణంగా సొమ్మ సిల్లి పడిపోయారని భావించారు. కానీ ఆసుపత్రిలో ప్రధమ చికిత్స అందించిన వైద్యులు హార్ట్ స్టోక్ గా తేల్చారు. ప్రధమ చికిత్స అనంతరం పట్టణంలోని పీఈఎస్ మెడికల్ కళాశాలకు తరలించారు.
ఆసుపత్రి ఐసీయూలో తారకరత్నకు వైద్య సేవలు అందించిన వైద్యులు మెరుగైన వైద్యం అందించాలని సూచించడంతో బెంగళూరు నారాయణ హృదయాలయ వైద్య బృందం అక్కడకు చేరుకుంది. పరీక్షలు జరిపారు. హైదరాబాద్ నుండి తారకరత్న సతీమణి, కుమార్తె వచ్చిన తర్వాత వారి సమ్మతితో బెంగళూరు తరలింపునకు చర్యలు చేపట్టారు. ప్రత్యేక అంబులెన్స్ లో బెంగళూరు నారాయణ హృదయాలయకు తరలించారు.
