tdp : టీడీపీ కి పరిషత్ భయం

Chandra Babu
Share

tdp : ఇప్పటికే గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూసి టిడిపి నేతలకు కొత్త భయం పట్టుకుంది. రేపో మాపో మండల పరిషత్, జిల్లా పరిషత్ లకు వరుసగా ఎన్నికలు వచ్చే వేళ ఈ ఫలితాలు విపక్ష పార్టీ నేతల్లో గుబులు పెంచుతున్నాయి. చాలా చోట్ల కనీసం పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరుకుతారా అన్న వింత ప్రశ్న టీడీపీ నేతలకు ఎదురు రావడం విశేషం.

ఓ నేత మదిలో ఇలా!

ప్రస్తుతం పార్టీ పరిస్థితి, వచ్చిన ఫలితాలను చూసి రాబోయే రోజుల్లో జరగబోయే రాజకీయాన్ని గురించి మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత నిర్వేదాన్ని వెలిబుచ్చారు. ఖచ్చితంగా మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికలకు పార్టీ నుంచి పోటీ చేసేందుకు సైతం అభ్యర్థులు ముందుకు రావడం లేదు అన్నది ఆయన మాట. మున్సిపల్ ఎన్నికల్లో ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు బయటకు వచ్చి ప్రచారం చేసినా పార్టీ కు తీవ్రమైన నిరాశ ఎదురవడంతో పార్టీ నేతల్లోనే అపనమ్మకం వచ్చేసిందని చెబుతున్నారు.

పార్టీని, చంద్రబాబు నాయకత్వాన్ని ప్రజలు నమ్మడం లేదు అన్నది తేలిపోతుందని, ముఖ్యంగా నారా లోకేష్ ప్రభావం టిడిపి మీద గట్టిగా ఉందన్నది ఆయన లెక్క. దీనిపై చంద్రబాబు దృష్టి పెట్టకుండా, కేవలం ఆయన అనుకున్న దారిలోనే ముందుకు వెళ్తుండటంతో పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారుతోందని, పార్టీలో మొదటి నుంచి ఉండి, నమ్ముకుని ఉన్న అమ్మ లాంటి వాళ్ళ పరిస్థితి ఏమవుతుందోనన్న భయం కూడా ఉందన్నది ఆయన ఆవేదన.

పరిషత్ ఎన్నికల్లో కష్టమే

వచ్చే మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో పార్టీకి మరో కష్టాన్ని తీరుతాయని అంచనా వేస్తున్నారు. అధికార పార్టీ ప్రభావం క్రమక్రమంగా తగ్గకపోగా పెరుగుతోందని, సంక్షేమ పథకాల ఫలాలు కేవలం గ్రామాల్లోనే కాకుండా నగరవాసుల్లో కూడా మంచి ప్రభావం చూపాయి అన్నది టీడీపీ నేతల లెక్క. దీంతోనే మున్సిపాలిటీల్లో కనీసం చెప్పుకోదగ్గ ఫలితాలను సాధించకపోవడంతో సంకేతంగా భావిస్తున్నారు. చదువుకున్న ఓటర్లు ఎక్కువగా ఉండే అర్బన్ ప్రాంతాల్లో ఇప్పటివరకు పార్టీ పరిస్థితి మీద ఎలాంటి డోకా ఉండేది కాదని, అయితే ఈ ఫలితాలను చూస్తే మాత్రం పార్టీ అధోగతి పాలు అవ్వడానికి దగ్గరగా ఉంది అన్న నిజం తెలుస్తోందని టిడిపి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

మరోపక్క మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పెద్ద నేతలు సిద్ధంగా లేరు. తమ అనుచరులను పోటీలో నిలబెట్టి ఏదో పోటీ చేసాం అన్న కోణంలోనే మమ అనిపించేందుకు నేతలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీలో ఉండి పోటీలో అభ్యర్థులను నిలబెట్టి కపోతే అధిష్టానం నుంచి కొత్త ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండటంతో, వాటిని కొని తెచ్చుకోవడం ఇష్టంలేక పోటీలో నిలవడం వృధా అనే కోణంలో ఈ కొత్త ఎత్తులు వేయడానికి టీడీపీ నేతలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రచారానికి సైతం భారీగా డబ్బు ఖర్చు పెట్టకుండా, వచ్చే పరిషత్ ఎన్నికల్లో సాధరణ పోటీకి దిగాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు.

చంద్రబాబు తీరు మీద!

పార్టీ స్టాండ్ విషయంలో చంద్రబాబు తీరు మీద పార్టీ నేతలంతా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు వెళ్తున్న దారిలో పార్టీ వెళితే కొద్ది రోజుల్లోనే విపక్ష పార్టీ హోదా కూడా పోయే అవకాశం కనిపిస్తున్న వేళ జిల్లాస్థాయి నేతలంతా ఇప్పటికే సీనియర్లకు దీని మీద ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు వైఖరి, లోకేష్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న తీరు, పార్టీ టేక్ అప్ చేస్తున్న అంశాలు, ప్రసంగాల్లో పూర్తి మార్పు వస్తే గానీ టీడీపీ భవిష్యత్తు ఉండదని కోణంలో గతంలో ప్రభుత్వం లో సైతం కీలకంగా వ్యవహరించిన కొందరు నేతలు ఇప్పటికే పొలిట్బ్యూరో సభ్యులు, సీనియర్లకు తమ అసహనాన్ని వెలిబుచ్చినట్లు తెలుస్తోంది.

వెంటనే దీని మీద చంద్రబాబు స్టాండ్ మారకపోతే టీడీపీ చరిత్రలో కలిసి పోవడం ఖాయమని, దానికి ఇప్పుడు వచ్చిన ఫలితాలే ఒక చక్కటి సందేశం అనే కోణంలో వారు కొన్ని ప్రతిపాదనలు చంద్రబాబు ముందు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే దారిలో వెళితే కనుక తమ దారి తాము చూసుకోవాలని ఇప్పటికే టిడిపి నేతలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నట్లు అర్థమవుతుంది.


Share

Related posts

Mansas Trust: ప్రభుత్వం ఎందుకో తప్పటడుగు వేస్తుంది..! మన్సాస్ పై మరకలేల..!? ఇలా చేయొచ్చుగా..!?

Srinivas Manem

కారు” మబ్బుల్లోకి… “కమలం” కొలనులోకి!! : స్పష్టంగా ప్రభుత్వ విఫల్యం

Special Bureau

YS Sharmila: కేసీఆర్ కు ష‌ర్మిల ఇస్తున్న షాకుల్లో కొత్త ట్విస్టు ఇది

sridhar