మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పై గతంలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన వైసీపీ నేత సొమిశెట్టి సుబ్బారావు గుప్తాను ఒంగోలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిషేదిత గంజాయి కల్గి ఉన్నాడన్న అభియోగంపై ఒంగోలులోని మంగమ్మ కళాశాల వద్ద గుప్తాను అదుపులోకి తీసుకున్నారు. ఆయనను ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ జరుపుతున్నారు. సుబ్బారావు గుప్తా కొంత కాలంగా బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన తనయుడు ప్రణీత్ రెడ్డి పై విమర్శలు చేస్తున్నారు.

గతంలో గుంటూరులోని ఒక లాడ్జీలో బాలినేని అనుచరులు సుబ్బారావు గుప్తాపై దాడి చేశారు. ఆ క్రమంలోనే సుబ్బారావు గుప్తా నివాసంపైనా దాడి చేశారు. అప్పటి నుండి సుబ్బారావు గుప్తా తాను వైసీపీ కార్యకర్తనేననీ, జగన్మోహనరెడ్డిని అభిమానినే అని పేర్కొంటూనే బాలినేని పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఆ సమయంలో సుబ్బారావు గుప్తా పలు మీడియాల్లో బాలినేనికి వ్యతిరేకంగా మాట్లాడటం, ఆర్యవైశ్య సంఘం నేతలు సుబ్బారావు గుప్తాకు బాసటగా నిలవడం జరిగింది. ఆ ఘటనతో సుబ్బారావు గుప్తా పేరు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. రీసెంట్ గా మహిళా వసతి గృహంపై బాలినేని అనుచురుడు సుబానీ ముఠా దాడి చేసిందనీ, ఈ విషయంలో బాలినేని తీరును వ్యతిరేకిస్తూ సుబ్బారావు గుప్తా పరుష పదజాలంతో విమర్శలు చేశారు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల్లోనే గంజాయి కల్గి ఉన్నాడన్న అభియోగంపై ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.