18.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Padma Awards 2023: ఏపి నుండి పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న ప్రముఖులు, వారి విజయాలు

Share

Padma Awards 2023: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో అందించిన విశిష్ట సేవలకు గానూ 106 మందికి    ప్రతిష్టాత్మక పద్మ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎనిమిది మంది ప్రముఖులకు పద్మశ్రీ అవార్డు లభించడం విశేషం. ఆర్ట్స్ విభాగంలో ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, చింతలపాటి వెంకటపతిరాజు (సీవీ రాజు), కోట సచ్చిదానంద శాస్త్రిలకు, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో గణేష్ నాగప్ప, అబ్బారెడ్డి నాగేశ్వరరావు, సామాజిక సేవా విభాగంలో సంకురాత్రి చంద్రశేఖర్, లిటరేచర్ విభాగంలో ప్రకాష్ చంద్ర సూద్, డాక్టర్ ఖాదర్ వలీ లకు ఏపి నుండి పద్మశ్రీ వరించాయి. ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీతల గురించి క్లుప్తంగా..

MM Keeravani
MM Keeravani

 

ఎంఎం కీరవాణి

ఎంఎం కీరవాణి అసలు పేరు కోడూరి మరకతమణి కీరవాణి. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరుపలో 1961 జులై 4న శివశక్తి దత్త, భానుమతి దంపతులకు ఆయన జన్మించారు. తండ్రి శివదత్త రాయచూరులో ఉండటంతో కీరవాణి కొవ్వూరులోని బాబాయి చంద్రబోస్ వద్ద కొన్నాళ్లు ఉన్నారు. కొవ్వూరులోనే ప్రాధమిక విద్య పూర్తి చేశారు. ఇంటికి దగ్గరలోనే ఉన్న కవితపు సీతన్న అనే విద్వాంసుని వద్ద వయోలిన్ నేర్చుకున్నారు. తండ్రి చిత్రలేఖనం, సంగీతం, కథలు, సాహిత్యాభిలాషి కావడంతో కీరవాణికి సినిమాల వైపు దృష్టి మళ్లింది. ఈ నేపథ్యంలో ఎల్వీ ప్రసాద్ వద్ద సహాయకుడిగా చేరినా మరల కొవ్వూరు వచ్చి వ్యవసాయం, వ్యాపారం చేసినా అనుకున్న స్థాయిలో రాణించలేదు. దాంతో కర్ణాటక లోని రాయచూరు వెళ్లి అక్కడే వివాహం చేసుకున్నారు. సినీ రంగానికి వచ్చిన తొలినాళ్లలో రాజమౌళి, చక్రవర్తి వంటి సంగీత దర్శకుల వద్ద సహాయకుడిగా పని చేశారు. 1989 లో ఉషా కిరణ్ మువీస్ వారు నిర్మించిన మనసు – మమత తెలుగు చిత్రం ద్వారా ఎంఎం కీరవాణి తెరనామంతో సంగీత దర్శకుడుగా వెండి తెరకు పరిచయం అయ్యారు. అప్పటి నుండి తెలుగు, తమిళ, హిందీ భాషలలో వందకుపైగా చిత్రాలకు సంగీతాన్ని అందించారు.  తెలుగు సినీ రంగంలో ఎంఎం కీరవాణిగా, తమిళంలో మరకతమణిగా, హిందీ సినీ రంగంలో ఎంఎం క్రీమ్ గా ప్రసిద్ధుడైయ్యారు. 1997 లో వచ్చిన అన్నమయ్య చిత్రానికి గానూ జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకునిగా పురస్కారం అందుకున్నారు. సంగీత దర్శకుడుగా అనేక అవార్డులు పొందిన కీరవాణి.. ఆర్ఆర్ఆర్ మువీలో స్వరపరిచిన నాటు – నాటు పాటకు ఉత్తమ అంగ్లేయేతర చిత్ర విభాగంలో ఆస్కార్ అవార్డు వరించింది.

Padma Shri Award Winners Andhra Pradesh
Padma Shri Award Winners Andhra Pradesh

చింతలపాటి వెంకటపతి రాజు

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలానికి చెందిన చింతలపాటి వెంకటపతిరాజు (సీవీ రాజు) లక్కబొమ్మల తయారీలో ప్రఖ్యాత కళాకారుడు. హస్తకళలను బతికించేందుకు ఎనలేని కృషి చేశారు. ఆయన పదవ తరగతి పూర్తి చేసే సమయానికి ప్రస్తుత అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాకలో పేరున్న హస్తకళాకారులు కళకు ఆదరణ లేక గ్రామాన్ని విడిచి కూలీ పనులకు వలస పోయే వారు. అది చూసిన సీవీ రాజు.. ఏటికొప్పాక పేరును తిరిగి నిలబెట్టాలని లక్కబొమ్మల పరిశ్రమపై దృష్టి సారించారు. ఢిల్లీకి వెళ్లి అధ్యయనాలు చేశారు. 1999లో ఏటికొప్పాకలో హస్తకళా నిలయాన్ని ఏర్పాటు చేసి కళాకారులకు అధునిక బొమ్మల తయారీపై శిక్షణ ఇచ్చారు. వారు తయారు చేసిన బొమ్మలకు వారే ధర నిర్ణయించుకునేలా చేశారు. పసుపు, ఇండిగో పిక్కలు, జాఫ్రా, కరక్కాయ తదితరాలతో ప్రకృతిసిద్దమైన రంగుల తయారీకి శ్రీకారం చుట్టారు. ఇలా కృషి చేస్తున్న సీవీ రాజుకు ఆర్ట్స్ విభాగంలో ప్రతిష్టాత్మక పద్మ శ్రీ అవార్డు వరించింది.

కోట సచ్చిదానంద శాస్త్రి

ప్రముఖ హరికథకుడు కోట సచ్చిదానంద శాస్త్రి. రామాయణ, మహాభారత ఇతిహాసాలు, అష్టాదశ పురాణాల్లోని ఆసక్తికర అంశాలను హరికథా రూపంలోకి తెచ్చి జనాకర్షకంగా చెప్పిన ఘనత కోట సచ్చిదానంద శాస్తికి దక్కుతుంది. శాస్త్రి తన హరికథల గానం ద్వారా సామాజిక రుగ్మతలు పొగొట్టేలా చైతన్యపరిచేవారు. హరికథ చెప్తూ నృత్యం చేస్తూ పాటలు పాడుతూ ప్రజలను ఆకట్టుకునే వారు. హరికథా భాగవతార్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాక ఇతర రాష్ట్రాల్లోనూ 1500 లకుపైగా పదర్శనలు ఇచ్చి అనేక మంది ప్రశంసలు, సన్మానాలు అందుకున్నారు. పండితులకే కాకుండా సామాన్య ప్రజలకు కూడా అర్ధమయ్యేలా చెప్పి వారిని మంచి మార్గంలోకి మరలేటట్లు ప్రభావితం చేయడానికి చాలా కృషి చేశారు. అప్పట్లో ఆయన కథ వినడానికి ఎండ్ల బండ్లు కట్టుకుని గుంటూరుకు వెళ్లే వారు. 1960 నుండి 1980 వరకూ రేడియోలో వేల ప్రదర్శనలు ఇచ్చారు.

గణేష్ నాగప్ప (కెఎన్ గణేష్)

తిరుపతి ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్ గణేష్. ఆయన 1953లో జన్మించారు. 1970 లో బీఎస్సీ కంప్లీట్ చేసి ఆ తర్వాత 1972లో బెంగళూరు విశ్వ విద్యాలయం నుండి రసాయన శాస్త్రంలో పీజీ పట్టా పొందారు. 1976లో ఢిల్లీ విశ్వ విద్యాలయం నుండి పీహెచ్ డీ సాధించారు. కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయంలో రెండో పీహెచ్ డీ చేశారు. 1981 లో హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ లో చేరారు. అక్కడ దేశంలోనే తొలి డీఎన్ఏ సంశ్లేషణ (సింథసిస్) సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. 1987 లో జాతీయ కెమికల్ లేబొరేటరీ (ఎన్సీఎల్, సీఎస్ఐఆర్) కు వెళ్లారు. అక్కడ 1994 లో ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగ అధిపతి అయ్యారు. 2006 లో పుణె లో ఏర్పాటు చేసిన ఐసర్ కు తొలి డైరెక్టర్ గా నియమితులైయ్యారు. గుర్తింపు పొందిన జర్నల్స్ లో 170 ప్రచురణలు చేశారు.

అబ్బారెడ్డి నాగేశ్వరరావు

ఏపికి చెందిన డాక్టర్ అబ్బిరెడ్డి నాగేశ్వరరావు (69)కి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో పద్మశ్రీ పురస్కారం వరించింది. ఆయన ఆర్కిడ్ జాతికి చెందిన 35 రకాల మొక్కలను కనుగొన్నారు. మణిపూర్ లోని సెంటర్ ఫర్ ఆర్కిడ్ జీన్ కన్జర్వేషన్ ఆఫ్ ఈస్ట్రన్ హిమాలయాస్ రీజియన్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించారు. 2012 లో ఆయన రిటైర్ అయ్యారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఆయన దశాబ్దాల పాటు సేవలు అందించారు. ఆయన పరిశోధనలకు గుర్తింపుగా రెండు ఆర్కిడ్ జాతి మొక్కలకు ఆయన పేరు పెట్టారు.

డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్

ప్రకాశం జిల్లా సింగరాయకొండ కు చెందిన డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ 1943 నవంబర్ 20న జన్మించారు. రాజమండ్రిలో ప్రాధమిక, కళాశాల విద్యను పూర్తి చేసిన చంద్రశేఖర్.. ఆంధ్ర విశ్వ విద్యాలయంలో జువాలజీ లో పీజీ పట్టాపొందారు. ఆ తర్వాత కెనడాకు వెళ్లి అల్బెట్టా విశ్వ విద్యాలయంలో పిహెచ్ డీ పొందారు. 1985 జూన్ 23న భార్య మంజరి, ఇద్దరు పిల్లలతో కెనడా నుండి ఢిల్లీకి వస్తున్న విమానాన్ని ఖలిస్థాన్ వేర్పాటువాదులు పేల్చేశారు. ఈ దారుణ ఘటన చంద్రశేఖర్ జీవితాన్ని కుదిపేసింది. ఆ తర్వాత ఆయన తన 22 ఏళ్ల కెనడా జీవిత ప్రస్థానానికి స్వస్తి పలికి ఉద్యోగాని వదిలి భారతదేశానికి తిరిగి వచ్చేశారు. కాకినాడ జిల్లాలో సంకురాత్రి ఫౌండేషన్ స్థాపించారు. 1992 లో 25 మందితో మొదలైన ఈవినింగ్ స్కూల్ ఇప్పుడు శారదా విద్యాలయంగా ఎందరికో విద్య అందిస్తొంది.

ప్రకాష్ చంద్ర సూద్

ప్రకాష్ చంద్ర సూద్ సత్యసాయి విశ్వ విద్యాలయంలో ప్రొఫెసర్ గా సేవలు అందిస్తున్నారు. పంజాబ్ లో 1928 సామాన్య కుటుంబంలో జన్మించిన ఆయన అక్కడే ప్రాధమిక, ఉన్నత విద్యా పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికా వెళ్లి పీ హెచ్ డి చేశారు. 1969 నుండి 1988 వరకూ వారణాసి లోని బెనారస్ హిందూ యూనివర్శిటీలో ప్రొఫెసర్ గా పని చేశారు. 1988 లో రిటైర్ అయ్యారు. ముంబాయిలోని బాబా అణు పరిశోధన కేంద్రంలో 1998 నుండి 1999 వరకూ పని చేశారు. సత్యసాయి బాబా సూచనల మేరకు 1998 నుండి సత్యసాయి విశ్వ విద్యాలయంలో విద్యాబోధనతో పాటు పరిశోధన అధ్యాపకుడుగా పని చేస్తున్నారు. ప్రత్యేకంగా న్యూక్లియర్ ఫిజిక్స్ ఎడ్యుకేషన్ రంగంలో ముందుకు వెళుతున్నారు. ప్రస్తుతం ఆయన భారతదేశంలోని అత్యంత సీనియర్ అణు శాస్త్రవేత్తలలో ఒకరు. భార్య ఉషారాణితో పాటు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

డాక్టర్ ఖాదర్ వలీ

చిరుధాన్యాల ఉపయోగాలు, వాటి వినియోగం గురించి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ వాటిని ప్రోత్సహిస్తున్న డాక్టర్ ఖాదర్ వలీకి పద్మశ్రీ పురస్కారం లభించింది. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో జన్మించిన ఆయన బీఎస్సీ, ఎంఎస్సీ (ఎడ్యుకేషన్) మైసూర్ లోని రీజినల్ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ లో పూర్తి చేశారు. అమెరికాలోని డ్యూపాండ్ కంపెనీలోనూ బాధ్యతలు నిర్వహించారు. అంతరించిపోతున్న అయిదు రకాల చిరు ధాన్యాలైన కొర్రలు, అండు కొర్రలు, సామలు, అరికెలు, ఊదల పునరుద్దరణకు కృషి చేశారు.

Padma Awards 2023: తెలంగాణ నుండి చినజీయర్, కమలేష్ కు పద్మభూషణ్, హనుమంతరావు, విజయ్ గుప్తా, రామకృష్ణారెడ్డిలకు పద్మశ్రీ పురస్కారాలు.. వారి గురించి


Share

Related posts

Revanth Reddy: ఏంటిది రేవంత్ … డ‌బ్బా కొట్టుకోవ‌డం అని అనుకుంటారు

sridhar

నయనతార రెండో హనీమూన్‌కి అంత ఖర్చు అయ్యిందా..?

Ram

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో రవి తో ఆ ఫుటేజ్ చూపించలేదు.. లహరి సంచలన కామెంట్స్..!!

sekhar