Pawan Kalyan: రైతులు తనకు సమస్యలు చెప్పుకున్నారనీ వారిపై అధికారులు గానీ, మంత్రులు గానీ, ఎమ్మెల్యేలు గానీ వేధింపులకు గురి చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఇటీవలి అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం పరిశీలించిన సంగతి తెలిసిందే. బాధిత రైతులను పరామర్శించారు. రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. గురువారం రాజమండ్రిలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పార్టీ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. రైతులు తమ సమస్యలను జనసేనకు చెప్పుకున్నారని కక్ష కట్టవద్దని పవన్ విజ్ఞప్తి చేశారు. డిమాండ్ల సాధన కోసం రైతులు ఆందోళన చేస్తే కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

అన్నం పెట్టిన రైతును వేధిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ..వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఏపీలో ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు జనసేన అండగా ఉంటుందని చెప్పారు. వారికి సరైన పరిహారం వచ్చే దాకా జనసేన పోరాటాన్ని చేస్తుందని స్పష్టం చేశారు. అకాల వర్షాలతో తడిసిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సకాలంలో ప్రభుత్వం పంటను కొనుగోలు చేయకపోవడం వల్లే అకాల వర్షాలకు ధాన్యం తడిసిందన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి, అధికారులు తాత్సారం చేశారనీ, సీఎం క్షేత్రస్థాయిలో వాస్తవ నివేదికలు పరిశీలించలేదని విమర్శించారు. తాను పర్యటన చేస్తున్నానని తెలిసి అధికారులు హడావుడిగా గోనె సంచులు ఏర్పాటు చేశారన్నారు. ఒత్తిడి చేస్తే తప్ప పట్టించుకోవడం లేదన్నారు.
తమకు రుణ మాఫీ అవసరం లేదనీ, ప్రతి పంటకు పావలా వడ్డీకి పాతిక వేలు చొప్పున రుణం ఇప్పించండి చాలు, తాము ఎవ్వరి మీదా ఆధారపడమని రైతులు వివరించారన్నారు. తనకు వినతి పత్రం ఇద్దామని రైతులు వస్తే.. అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారన్నారు. రైతులకు వైసీపీ చేస్తున్న అన్యాయం అది అన్నారు. రైతుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలే తప్ప సమస్యలు చెప్పుకున్న వాళ్లపై కేసులు పెట్టి హింసిస్తే సహించేది లేదనీ, సమస్య మరింత తీవ్రమవుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు.
Centre vs Delhi govt case: సుప్రీం కోర్టులో కేంద్రానికి షాక్ .. ఢిల్లీలో అధికారంపై సంచలన తీర్పు