Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందని ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే ఎన్డీఏతో జనసేన భాగస్వామ్య పక్షంగా ఉన్న సంగతి తెలిసిందే. టీడీపీతో పొత్తు విషయంపై బీజేపీ ఇంత వరకూ ఎటువంటి సంకేతాలు ఇవ్వలేదు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో ముందుకు వెళుతున్నట్లు ప్రకటించారు. దీంతో జనసేన ఎన్డీఏ నుండి బయటకు వస్తుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఇవేళ జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో దీనిపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. జనసేన ఇప్పటికీ ఎన్డీఏలో భాగస్వామ్య పక్షమేనని చెప్పారు. ఏపీలో తెలుగుదేశం పార్టీతో సమన్వయం చేసుకునేందుకు పార్టీ తరపున నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ఒక కమిటీ పని చేస్తుందని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా పని చేసిన ఆయన అనుభవం ఇందుకు ఉపయోగపడుతుందని చెప్పారు.
2024 ఎన్నికల తర్వాత అధికారంలో భాగస్వామ్యం తీసుకుంటామని చెప్పారు. సమయం వచ్చినప్పుడు పవర్ షేరింగ్ పై మాట్లాడుకుందామని తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత రాజు ఎవరో.. మంత్రి ఎవరో తేలుతుందన్నారు. జనసేన అధికారంలోకి వచ్చిన రోజు నుండి రాష్ట్ర దశ, దిశ మారుస్తామని అన్నారు. కొందరు అధికారులు ఇప్పటికైనా పద్దతి మార్చుకోవాలని సూచించారు. త్వరలో బీజేపీ ఆశీస్సులతో ఏర్పడబోయే టీడీపీ, జనసేన ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. ఏపికి మంచి రోజులు వస్తాయన్నారు. రాష్ట్రానికి బలమైన భవిష్యత్తు ఇవ్వబోతున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. సీఎంగా ఉంటే ఇష్టం వచ్చినట్లుగా చేస్తే కరెక్టు కాదని అన్నారు.
సీఎం అంటే ప్రజలకు ట్రస్టీ అని, మంత్రుల కంటే కాస్త ఎక్కువ అధికారాలు మాత్రమే ఉంటాయన్నారు. సీఎం జగన్ తనకు తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారని, జనాగ్రహం చూస్తే తట్టుకోలేరని అన్నారు. సంక్షేమ పథకాలు జగన్ వచ్చి తర్వాతనే అమలు కావడం లేదనీ, ఎన్నో దశాబ్దాలుగా పాలకులు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నాని అన్నారు. రాష్ట్రంలో జగన్ రాజ్యాంగ విరుద్దంగా పాలన చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఎంతటి పోరాటానికైనా సిద్దమనీ, కానీ సంయమనం పాటిస్తున్నాననీ, అది చేతకానితనం అనుకోవద్దని అన్నారు. జనసేన అసెంబ్లీలో అడుగుపెట్టిన రోజున ఏపీ దశ దిశ మారుతుందని హామీ ఇచ్చారు. జనసేన కేవలం అసెంబ్లీలోనే కాకుండా పార్లమెంట్ కు కూడా వెళ్లాలని, అందుకోసం టీడీపీతో కలిసి పని చేద్దామని అన్నారు.
టీడీపీతో పొత్తుపై త్వరలోనే ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు వివరిస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్టు వ్యవహారాన్ని కేంద్ర పెద్దల దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. టీడీపీ విషయంలో పార్టీ శ్రేణులు ఎలాంటి బేషజాలకు పోవొద్దని సూచించారు. ఒకరు ఎక్కువ కాదు.. మరొకరు తక్కువా కాదని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడమే మనకు ముఖ్యమని పవన్ తెలిపారు. వైసీపీ నాయకులు ఎంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా ఎవరూ గొడవ పెట్టుకోవద్దని పవన్ సూచించారు. వైసీపీని రాష్ట్రం నుండి తరిమి వేసేందుకు ఇదే సరైన సమయం అని అన్నారు.
Prashant Kishor: ఓటర్లపై ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు