జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నేడు మొదలు కానుంది. గోదావరి జిల్లాల్లో రెండు విడతల వారాహి యాత్ర పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ మూడవ విడత యాత్ర ఉత్తరాంధ్రలో నేటి నుండి మొదలు పెట్టనున్నారు. విశాఖ నుండి ప్రారంభమయ్యే మూడవ విడత వారాహి యాత్ర ఉత్తరాంధ్రలో పది రోజుల పాటు సాగనున్నది. యాత్రలో భాగంగా పవన్ విశాఖలోని పలు ప్రాంతాలను సందర్శించనున్నారు. స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టు కార్మికుల పోరాటానికి మద్దతు తెలుపనున్నారు. వారాహి యాత్రలో భాగంగా ఇవేళ (గురువారం) సాయంత్రం జగదాంబ జంక్షన్ లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడనున్నారు. అనంతరం జనవాణి కార్యక్రమం, క్షేత్ర స్థాయి పర్యటనలకు పవన్ వెళ్లనున్నారు.

అటు గోదావరి జిల్లాల్లో వారాహి యాత్రలో పలు నియోజకవర్గాలకు ఇన్ చార్జ్ లను ప్రకటించిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఉత్తరాంధ్రలోనూ నియోజకవర్గాలకు ఇన్ చార్జ్ లను ప్రకటిస్తారా.. ఏయే నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టనున్నారు అన్నదానిపై పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో టీడీపీకి ఆ తర్వాత వైసీపీకి విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ ఇటీవల జనసేన పార్టీలో చేరిన నేపథ్యంలో ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంలో ఆయనకు ఏ రకమైన బాధ్యతలను అప్పగించనున్నారు అనే చర్చ కూడా సాగుతోంది. గత ఏడాది పవన్ విశాఖ పర్యటనకు వచ్చిన సమయంలో ఎయిర్ పోర్టు వద్ద ఘర్షణ జరగడం తీవ్ర సంచలనం అయ్యింది. దాదాపు వంద మంది జనసేన నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు అయ్యాయి. పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. బీచ్ రోడ్డులోని హోటల్ లోనే పవన్ కళ్యాణ్ ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఇవేళ జరిగే బహిరంగ సభలో పవన్ ఏ అంశంపై మాట్లాడతారు అనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా ఉంది.
ఇక వారాహి యాత్రను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీలను పార్టీ ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. పవన్ వారాహి యాత్రకు పోలీసులు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదనీ, ఎయిర్ పోర్టు నుండి ర్యాలీ గా వెళ్లొద్దనీ, వాహనంపై నుండి అభిమానులకు అభివాదాలు చేయవద్దని పోలీసులు షరతులు పెట్టారు. జగదాంబ జంక్షన్ లో బహిరంగ సభకు పోలీసులు అనుమతి మంజూరు చేసినా.. భవనాలపైకి కార్యకర్తలు, అభిమానులు ఎక్కకుండా చూసే బాధ్యత జనసేనదేనని, ఉల్లంఘనలు జరిగితే అనుమతి తీసుకున్న వారిదే బాధ్యత అని పోలీసులు స్పష్టం చేశారు.
పోలీసుల షరుతలపై జనసేన పార్టీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ పార్టీ శ్రేణులకు సూచనలు జారీ చేసింది. ర్యాలీలో లేదా సభా వేదిక వద్ద క్రేన్ లతో గజమాలలు వేయడం లాంటివి చేయవద్దని, భద్రతకు సహకరించాలని కోరింది. వారాహి యాత్ర మార్గంలో క్రేన్లు, వాహనాలు ఏర్పాటు చేయడం వల్ల వాహనాల శ్రేణి సాఫీగా సాగడం లేదని జనసేన పార్టీ ప్రకటనలో తెలిపింది. పవన్ కళ్యాణ్ భద్రతకు భంగం వాటిల్లకుండా వారాహి విజయ యాత్ర విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. భద్రతా కారణాలను పార్టీ శ్రేణులు, అభిమానులు దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది.