అఖిల‌ప్రియ అదిరిపోయే స్కెచ్ .. షాక్ అయిన పోలీసులు

తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టిస్తున్న హ‌ఫీజ్‌పేట్ భూముల వ్య‌వ‌హ‌రంలో ట్విస్టుల మీద ట్విస్టులు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేత , మాజీ మంత్రి అఖిల‌ప్రియ వైఖ‌రి తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది.

 

అఖిల‌ప్రియ పాత్ర కీల‌క‌మ‌ని పోలీసులు పేర్కొంటుండ‌గా ఇంకో పేరు , వారి సంచ‌ల‌న పాత్ర వెలుగులోకి వ‌చ్చింది. విజయవాడకు చెందిన సిద్ధార్థ కీలక సూత్రధారి అని పోలీసుల విచారణలో బయట పడింది. విజయవాడ సమీపంలోని నందిగామకు చెందిన సిద్ధార్థ పాత్ర ఇప్పుడు హాట్ టాపిక్‌.

ఎవ‌రీ సిద్ధార్థ?

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో పోలీసులు మరో 12 మందిని అరెస్టు చేశారు. వీరంతా విజయవాడ సమీపంలోని నందిగామకు చెందిన వారు. ఈ బెజవాడ బ్యాచ్‌కు సిద్ధార్థ్‌ లీడర్‌గా వ్యవహరించారు. సిద్ధార్థ్‌ నందిగామ ప్రాంతంలో సెక్యూరిటీ ఏజెన్సీ నడుపుతున్నట్టు సమాచారం. బౌన్సర్లుగా వ్యవహరించిన వాళ్లంతా సిద్ధార్థ్‌ నడుపుతున్న ఏజెన్సీలో పనిచేసే వాళ్లే. వీళ్లందరినీ ఈ నెల 4న నగరానికి తీసుకొచ్చినట్టు తెలిసింది. ఐటీ అధికారుల వెంట బౌన్సర్లుగా ఉండాలని, తగిన పారితోషికం ఇస్తామని సిద్ధార్థ్‌ వారికి చెప్పినట్టు సమాచారం. కిడ్నాప్‌ సీన్‌ రివర్స్‌ కావడంతో వారంతా కేసులో నిందితులుగా ఇరుక్కుపోయారు. సిద్ధార్థ్‌ పోలీసులకు చిక్కడంతో అతని వెంట వచ్చిన బౌన్సర్ల వివరాలు పోలీసులకు తెలిసిపోయాయి.

భూమా వెంటే సిద్ధార్థ‌

విజయవాడలో ఉండే సిద్ధార్థ మనుషుల తరలింపులో కీలక పాత్ర పోషించారని టాస్క్ ఫోర్స్ విచారణలో బయట పడింది. విజయవాడ గుంటూరు వైజాగ్ లాంటి ప్రాంతాలకు భూమా కుటుంబసభ్యులు వెళ్ళినప్పుడు వారికి సెక్యూరిటీగా సిద్ధార్థ తన మనుషుల్ని పంపుతాడు. అయితే ఈ కిడ్నాప్ లో కూడా సిద్ధార్థను… భార్గవ్ రామ్ ఫుల్ గా వాడుకున్నాడు. హైదరాబాదులో ఐటి దాడులు కొనసాగుతున్నాయని.. వాళ్ల దగ్గర సిబ్బంది లేరని.. మీరు వెంటనే హైదరాబాద్కు రావాలని భార్గవ్ సిద్ధార్ధకు కబురుపెట్టాడు. దీంతో మొత్తం 19 మంది కలిసి విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. కిడ్నాప్ వ్యవహారంలో వీరి పాత్ర బ‌య‌ట‌ప‌డింది. దీంతో గోవా, విజయవాడ, గుంటూరు హైదరాబాద్ లో వీరిని కస్టడీలో కి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి పూర్తి స్థాయి సమాచారాన్ని అధికారాలు రాబట్టారు. అయితే కిడ్నాప్ ప్లాన్ ఎవరిచ్చారు అనే దానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు.