PR GO 2 Dispute : జగన్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి లేఖ..! వైసీపీలో కొత్త వాదనలు..!!

Share

PR GO 2 Dispute : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పరిపాలనలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పుల్లో గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రధానమైనదిగా చెప్పవచ్చు. ఈ వ్యవస్థను తీసుకువచ్చిన తరువాత ప్రజలు తమ పనుల కోసం మండల రెవెన్యూ కార్యాలయ చుట్టూ తిరగకుండా గ్రామ సచివాలయాల నుండే సేవలను పొందుతున్నారు. అయితే ఇటీవల జగన్మోహనరెడ్డి సర్కార్ జారీ చేసిన ఓ జివో నెం.2 రెండు శాఖల మధ్య తీవ్ర దుమారాన్ని రేపుతోంది. మొన్నటి వరకూ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లకు డీడీఓలుగా పంచాయతీ కార్యదర్శులు ఉండే వారు. తాజా జివో ప్రకారం విఆర్ఓలకు ఆ బాధ్యతను అప్పగించారు. ఈ పరిణామం పంచాయతీ కార్యదర్శులు, విఆర్ఓల మధ్య తీవ్ర విబేధాలకు కారణం అవుతోంది. తమకు సచివాలయాలపై అధికారం కల్పించినందుకు విఆర్ఓలు సంతోషం వ్యక్తం చేస్తుండగా, తమ అధీనంలోని ఉద్యోగులను రెవెన్యూ పరిధిలోకి తీసుకువెళ్లడం సరైన చర్య కాదని కార్యదర్శుల సంఘం పేర్కొంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జోవోను ఉపసంహరించుకోవాలంటూ సచివాలయ ఉద్యోగులు నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తూ అటు ఎండిఓలకు, ఎమ్మెల్యేలను కలిసి వినతి పత్రాలను సమర్పిస్తున్నారు.

PR GO 2 Dispute MLA Chevireddy's letter
PR GO 2 Dispute MLA Chevireddy’s letter

ఇప్పుడు తాజాగా అధికార పార్టీ ఎమ్మెల్యేలలోనే దీనిపై భిన్న వాదనలు వినబడుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పంచాయతీ రాజ్ ఉద్యోగులు చేస్తున్న నిరసనకు ఎండిఓ మద్దతు తెలపడంపై ఎలమంచిలి వైసీపీ ఎమ్మెల్యే రమణమూర్తి రాజు (కన్నబాబు) ఏకంగా ఎండిఓను సస్పెండ్ చేయాలంటూ జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని అక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యే సమర్ధిస్తుండగా, మరో పక్క అదే పార్టీకి చెందిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పంచాయతీ రాజ్ ఉద్యోగులకు మద్దతు పలకడం విశేషం. ఆయన అంతటితో ఆగకుండా జీవో 2 ను రద్దు చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి లేఖ రాయడం మరో విశేషం. ఇప్పుడు ఇది రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యింది. రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలలో చాలా మంది ప్రభుత్వ నిర్ణయాన్ని పునః సమీక్షించాలని కూడా చెప్పే ధైర్యం చేయలేని పరిస్థితిలో చెవిరెడ్డి ధైర్యంగా ప్రభుత్వ నిర్ణయం సమంజసంగా లేదు, గ్రామ సచివాలయ వ్యవస్థలో పాత విధానాన్నే కొనసాగించాలని మంత్రికి విజ్ఞప్తి చేయడం గమనార్హం.

గ్రామ సచివాలయ వ్యవస్థ గాడి తప్పకుండా ఉండేందుకే చెవిరెడ్డి జగన్ శ్రేయోభిలాషిగా ఈ నిర్ణయం తీసుకున్నారని పంచాయతీ రాజ్ ఉద్యోగులు పేర్కొంటున్నారు. వాస్తవానికి గ్రామ సచివాలయ వ్యవస్థలో విఆర్ఓలకు పెత్తనం ఇస్తే కొంత మేర దుష్పలితాలు ఉంటాయనే ఆందోళన సామాన్య ప్రజానీకంలో బలంగా ఉంది. ఓ పక్క తెలంగాణలో విఆర్ఓల వ్యవస్థనే అక్కడి సీఎం కేసిఆర్ రద్దు చేసిన విషయాన్ని ఇక్కడి ప్రజానీకం గుర్తు చేస్తున్నది. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరరెడ్డి పంచాయతీరాజ్ ఉద్యోగులకు సమర్థిస్తుండగా ఆయన వాదనకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు మద్దతుగా నిలుస్తారో లేదో వేచి చూడాలి. ఏది ఏమైనా ఈ వివాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి క్షేత్ర స్థాయి పరిస్థితులను, ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకుని నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనే మాట వినబడుతోంది.

 


Share

Related posts

జైలుకే: అనిల్ అంబానీకి సుప్రీంకోర్టు షాక్

Siva Prasad

‘నాకు ఏమి జరిగినా ఆయనే కారణం’

somaraju sharma

నలుగురు టెర్రరిస్టులు మృతి

Siva Prasad