దేశ భాష లందు తెలుగు భాష గొప్పతనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్లాషించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి విజయవాడ పోరంకి లోని ఓ ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్ నందు ప్రభుత్వం ఆధ్వర్యంలో పౌర సత్కారం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ..దేశ భాషలందు తెలుగు లెస్స .. అందరికీ నమస్కారం.. మీ అభిమానానికి ధన్యవాదాలు అని తెలుగులో పేర్కొన్నారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి ఉండే ఈ నేలపై అడుగు పెట్టడం ఆనందంగా ఉందని అన్నారు. నాగార్జునుడు అమరావతిలో చేసిన బోధనలు చాలా గొప్పవని అన్నారు.

ఏపి నుండి వీవీ గిరి, నీలం సంజీవరెడ్డి లు దేశంలో ఏపి నుండి రాష్ట్రపతి బాధ్యతలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలనీ, కనకదుర్గమ్మ ఆశీస్సులు అందరిపైనా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రానికి చెందిన మహానీయులు అల్లూరి సీతారామరాజు, గురజాడ అప్పారావు, కవయిత్రి మొల్ల, దుర్గాభాయ్ దేశ్ ముఖ్, సరోజిని దేవి నాయుడు, పింగళి వెంకయ్య తదితరుల పేర్లును రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి నదులు రాష్ట్రాన్ని పునీతం చేశాయన్నారు. ఆంధ్రా ప్రజల అభిమానానికి కృజ్ఞతలు తెలిపారు. దేశ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ది అసాధారణ భాగస్వామ్యం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సన్మానించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని సీఎం వైఎస్ జగన్ అన్నారు. దేశ చరిత్రలోనే ఒక గిరిజన మహిళ రాష్ట్రపతి పదవిని చేపట్టడం అందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ద్రౌపది ముర్ము గతంలో అనేక పదవుల్లో రాణించారనీ, పదవులకే వన్నె తెచ్చారని, సామాజిక వేత్తగా, ప్రజా ప్రతినిధిగా ద్రౌపది ముర్ము ఎన్నో సేవలు అందించాన్నారు. ప్రతి ఒక్క మహిళ కు ఆమె స్పూర్తిదాయకమని జగన్ కొనియాడారు.

ఈ కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఏపి పర్యటనలో భాగంగా విజయవాడ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గన్నవరం విమానాశ్రయంలో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్ పోర్టులో ద్రౌపది ముర్ము పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. పౌర సన్మానం అనంతరం రాష్ట్రపతి గౌరవార్ధం రాజ్ భవన్ లో ద్రౌపది ముర్ముకు విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్, భారతి దంపతులు పాల్గొని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సత్కరించి జ్ఢాపికను అందజేశారు.