Road Accident: నెల్లూరు జిల్లాలో చెన్నై – కోల్ కతా జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు. జిల్లాలోని మనుబోలు బద్దెవోలు సమీపంలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం దామోగుంటకు చెందిన గ్రేష్మ అనారోగ్యంతో బాధపడుతుండగా ఆసుపత్రిలో చూపించేందుకు బంధువులు దుర్గా ప్రసాద్, విష్ణుప్రియ, రామారావు (40), వనిత, ఎంజెల్, మెర్సీ (15), సనత్ తేజ (3) లతో కలిసి కారులో చెన్నై బయలుదేరారు. మనుబోలు మండలం బద్దెవోలు అడ్డరోడ్డు వద్దకు రాగానే కారు అదుపుతప్పి రహదారి పక్కన ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా అందులో ప్రయాణిస్తున్న రామారావు, మెర్సీ, సనత్ తేజ లు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన అయిదుగురు తీవ్రంగా గాయపడటంతో వారిని అంబులెన్స్ లో గూడురు ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
TS EAMCET Results 2023: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల .. టాపర్స్ వీరే