Nellore: నెల్లూరు జిల్లాలో అర్ధరాత్రి రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లలో దోపిడీ దొంగలు హాల్ చల్ చేశారు. ఈ ఘటనలు రైలు ప్రయాణీకులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తొంది. హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ ను ఉలవపాడు పరిధిలో సుబ్బరాయుడు సత్రం గేటు వద్ద ఆరుగురు దుండగులు నిలిపివేశారు. అనంతరం దొంగలు ట్రైన్ లోని ఎస్ – 1, ఎస్ -2, ఎస్ – 3 బోగీల్లోకి ప్రవేశించి మహిళల వద్ద సుమారు 30 తులాల బంగారాన్ని, నగదును చోరీ చేశారు.
అనంతరం తెట్టు సమీపంలో చార్మినార్ ఎక్స్ ప్రెస్ ను నిలిపి చోరీకి ప్రయత్నించారు. అయితే రైల్వే పోలీసులు అప్రమత్తమై వారిని ఎదుర్కొన్నారు. దీంతో దొంగలు వారిపై రాళ్లు రువ్వి పారిపోయారు. ఆ తర్వాత ట్రైన్ ముందుకు కదిలింది. రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లలో జరిగిన ఘటనలపై ప్రయాణీకులు తెట్టు, కావలి రైల్వే స్టేషన్ లలో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రయాణీకుల ఫిర్యాదు మేరకు ఒంగోలు రైల్వే పోలీసులు తనిఖీలు చేపట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.