శ్రీశైలం ఘాట్ రోడ్డు తెలంగాణ ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. బస్సు పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. శ్రీశైలం నుండి మహబూబ్ నగర్ వెళుతున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు శ్రీశైలం జలాశయం మలుపు వద్ద అదుపుతప్పి రిటైనింగ్ వాల్ ను ఢీకొట్టి నిలిచిపోయింది. రక్షణ గోడకు ఇనుప బారికేడ్ ఉండటంతో బస్సు లోయలో పడకుండా ఆగిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణీకులు ఉన్నారు. రిటైనింగ్ వాల్ కు ఢీకొని బస్సు ఆగిపోవడంతో అప్రమత్తమైన ప్రయాణీకులు వెంటనే బస్సు లో నుండి దిగిపోయారు.

మలుపు వద్ద రేయిలింగ్ లేకపోయినా, అది బలహీనంగా ఉన్నా బస్సు లోయలో పడేదని ప్రయాణీకులు తెలిపారు. ఘటనను చూసి తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణీకులు తమను శ్రీశైలం మల్లన్నే కాపాడారని పేర్కొంటున్నారు. ప్రయాణీకులను వేరే బస్సులో గమ్యస్థానాలకు తరలించారు. ప్రమాద ఘటనపై ఆర్టీసీ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ప్రమాదానికి కారణం ఏమిటి.. డ్రైవర్ నిర్లక్ష్యమా లేక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనేది ఆర్టీసీ ఉన్నతాధికారుల దర్యాప్తులో తేలనున్నాయి.
