టీడీపీ అధినేత చంద్రబాబుతో నిన్న హైదరాబాద్ లో జనసేన అధినేత అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం కావడంపై వైసీపీ నుండి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తూనే ఉన్నాయి. మంత్రులు, వైసీపీ నేతలు వారి భేటీపై విమర్శలు గుప్పించారు. జగన్మోహనరెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ముగింపునకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా తాడేపల్లి లోని ఘనంగా వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నేతలతో కలిసి భారీ కేక్ చేశారు. అనంతరం సజ్జల ..చంద్రబాబు, పవన్ భేటీపై స్పందిస్తూ ఘాటు విమర్శలు చేశారు. రాజకీయాల్లో ఉండి ఏమి సాధించాలన్న దానిపై స్పష్టత ఉండాలే తప్ప 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశాను, మరెన్నో ఏళ్లు విపక్ష నేతగా చేశానని చెప్పుకుంటే ఉపయోగం లేదని చంద్రబాబును ఉద్దేశించి సజ్జల అన్నారు. చంద్రబాబు గానీ, పవన్ కళ్యాణ్ గానీ పగటి వేషాలు వేసినా, ఇంకా మరింత మందిని కలుపుకున్నా, గుంటనక్కలు, పందికొక్కులు, ఎలుకలు అన్నీ కలిసి వచ్చినా ప్రజాబలం ఉన్న జగన్ ముందు భంగపాటు తప్పదని పేర్కొన్నారు. జనసేన, టీడీపీ కలవడం శుభపరిణామం అని సీపీఐ రామకృష్ణ అనడంపై సజ్జల కౌంటర్ ఇస్తూ వీరితో బీజేపీ కూడా కలిస్తే ఆయన ఏమంటారో తెలియదు, ఎరుపు, కాషాయం కలిస్తే పసుపు అవుతుందేమో అంటూ సెటైర్ వేశారు.

చంద్రబాబు, పవన్ రహస్యంగా సమావేశమవుతూ తమ బంధం సక్రమమే అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని సజ్జల విమర్శించారు. బాబు ఆలోచనలు అన్నీ తాను, తన కోటరీ బాగుపడాలన్న దాని చూట్టూనే తిరుగుతాయనీ, అవసరం అయితే వేల ఎకరాలైనా ఎలా కబ్జా చేస్తారో తెలుసని, వెన్నుపోటు తదితర అంశాలు ఆయన చిహ్నం అన్న సంగతి ప్రజలకు తెలుసని అన్నారు. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదనీ, అందరికీ తెలిసిందేనన్నారు. చెప్పుకోవాల్సి వస్తే పవన్ కళ్యాణ్ లాంటి వారి గురించి చెప్పుకోవాలన్నారు. సిద్ధాంతాలతో గానీ ప్రజల మీద ప్రేమతో గానీ, విలువలతో కానీ పోరాడలేక ఇలా అడ్డదారిలో వస్తున్న వీళ్ల తిప్పలు చూస్తుంటే.. జగన్మోహనరెడ్డి ఎంతో బలవంతుడు అన్న విషయం తెలుస్తొందని సజ్జల వ్యాఖ్యానించారు. ఇది అహంకారంతో చెబుతున్న మాట కాదనీ, ప్రజాస్వామ్యంలో బలం అంటే ప్రజల అండ, ప్రజల దీవెనలేనని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంపై ప్రజల అశీస్సులు పుష్కలంగా ఉన్నాయని అన్నారు.
కొందరు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పాదయాత్రలకు సిద్దమవుతున్నారనీ, పాదయాత్రతో జనం లోకి వెళ్లగానే వారి దీవెనలు లభిస్తాయనే భ్రమలో ఉన్నారని సజ్జల విమర్శించారు. ప్రజలను భ్రమలకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వారికి కనువిప్పు కలిగేలా సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. పాదయాత్ర చేసినా, ఇంకేమైనా చేసినా చిత్తశుద్ధి, నిజాయితీ అనేది ఉండాలని సజ్జల స్పష్టం చేశారు. చేస్తే ప్రజా సేవ చేయాలి తప్ప వేరే మార్గంలో వెళ్లకూడదని అన్నారు. వీరికి ప్రజలే బుద్ది చెబుతారని సజ్జల పేర్కొన్నారు. ఎంత మంది కలిసి వచ్చినా తమకు మంచిదేననీ, గుంపుగా వస్తేనే అందరినీ ఒకే సారి ఓడించే అవకాశం జగన్ కు దక్కుతుందని అన్నారు సజ్జల. ఇదే సందర్భంలో ముందస్తు ఎన్నికలకు అంటూ వస్తున్న వార్తలపైనా సజ్జల క్లారిటీ ఇచ్చారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం సీఎం వైఎస్ జగన్ కు లేదని స్పష్టం చేశారు. తమకు ప్రజలు అయిదేళ్ల కాలానికి తీర్పు ఇచ్చారనీ, తాము పూర్తి గా పాలించి ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. వైసీపీ గత ఎన్నికల్లోనూ సింగిల్ గా పోటీ చేసి రాబోయే ఎన్నికల్లోనూ సింగిల్ గా పోటీ చేస్తుందని సజ్జల స్పష్టం చేశారు.