Sajjala Ramakrishna Reddy: మార్గదర్శిది అక్రమాల పుట్ట అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహదారులు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. శుక్రవారం మీడియాతో సజ్జల మాట్లాడుతూ మార్గదర్శి సంస్థ చిట్ ఫండ్ మోసాలుకు సంబంధించి పోలీసులు, ఐటీ అధికారుల విచారణలో పుట్ట పగులుతుందని అన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ పేరిట వేల ఎకరాల భూకబ్జాల భాగోతాలు కూడా బయటకు రాబోతున్నాయన్నారు. ఈనాడు అనే మీడియా సంస్థను అడ్డం పెట్టుకుని తన పెట్టుబడి ఏమీ లేకుండా ప్రజల పెట్టుబడితో మార్గదర్శి ద్వారా వ్యాపారం చేస్తున్న పెద్దమనిషి రామోజీరావు అని విమర్శించారు.

నాడు అగ్రిగోల్డ్, సహారా సంస్థల్లాంటి మోసాల్లాగానే ఇప్పుడు రామోజీరావు మార్గదర్శి మోసాలు వరుసగా బయటపడుతున్నాయని చెప్పారు. ఈయన అందరి మీద అవినీతి, మోసాలు అంటూ కథనాలు రాస్తారని అన్నారు. ప్రజల సొమ్ముతో ఏ బాధ్యత, ఏ పూచీ లేకుండా వ్యాపారం జరుగుతున్న సంస్థగా మార్గదర్శి ఉన్నప్పుడు పోలీసులు ఎందుకు దర్యాప్తు చేయొద్దు? సంస్థకు అసలు బాధ్యులెవరో తెలియకుండానే జనం దగ్గర వందల కోట్ల డిపాజిట్లు వసూలు చేస్తున్నారనీ, ఇది ఖచ్చితంగా నమ్మకద్రోహమని అన్నారు. డబ్బులు వసూలు చేస్తూ.. వాటిని ఎక్కడికో తరలిస్తున్నారని ఆరోపించారు.
చంద్రబాబుకు అధికార పత్రికగా ఈనాడు నడుస్తుందని సజ్జల విమర్శించారు. తమ ప్రభుత్వంపై బురద జల్లేందుకు రోజుకో కథనం అల్లుతూ ప్రజల్ని భ్రమింపజేయాలని రామోజీరావు ప్రయత్నిస్తున్నారనీ కానీ ఆయన నమ్మకం నెరవేరదన్నారు. కేవలం, మీడియా చేతిలో ఉందని రామోజీరావు రాజకీయం నడిపిస్తున్నారని అన్నారు. మార్గదర్శి కుంభకోణంకు తెలుగుదేశం మద్ధతిస్తే ప్రజలకు ద్రోహం చేసినట్లే అవుతుందన్నారు. రామోజీరావు కు రాజ్యాంగం వేరుగా ఉంటుందా..? అని ప్రశ్నించారు. పోలీసులు, ఐటీ అధికారులు విచారణకు వచ్చినప్పుడు వారికి సహకరించాల్సింది పోయి ఇష్టానుసారంగా ప్రభుత్వం మీద కథనాలు రాస్తూ మీడియా రౌడీయిజానికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.
Media: జర్నలిజాన్ని భ్రష్టుపట్టిచేస్తున్నారు(గా)..! ఇదో ఉదాహరణ