ఏపి సర్కార్ తీసుకుంటున్న పలు నిర్ణయాలు న్యాయ సమీక్షలో వీగిపోతున్న సంగతి తెలిసిందే. హైకోర్టులో వ్యతిరేక తీర్పు వస్తే ఆ తీర్పులను సుప్రీం కోర్టులో సవాల్ చేసినా అక్కడా చుక్కెదురు అవుతున్న సందర్భాలు ఉన్నాయి. హైకోర్టులో వ్యతిరేక తీర్పు వచ్చిన అనంతరం అయినా న్యాయ నిపుణులతో సమీక్ష, వాటిపై పునరాలోచన వంటివి చేస్తున్నారో తెలియదు కానీ హైకోర్టు తీర్పులను సుప్రీం కోర్టులో సవాల్ చేయడం పరిపాటిగా మారింది. పలు కేసుల్లో సుప్రీం కోర్టులోనూ హైకోర్టు తీర్పునే సమర్ధిస్తున్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా అహోబిలం మఠం ఈవో నియామకం విషయంలోనూ ఏపి సర్కార్ కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

అహోబిలం మఠానికి ప్రభుత్వం కార్యనిర్వహణ అధికారి (ఇఓ) నియామకాన్ని గతంలో ఏపి హైకోర్టు తప్పుబడుతూ తీర్పు ఇచ్చింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ధర్మాసనం .. మఠం సాధారణ కార్యకలాపాలతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి సంబంధమని ప్రశ్నించింది. మఠాన్ని ఎందుకు చేజిక్కించుకోవాలనుకుంటున్నారని నిలదీసింది. ఆలయాలు, ధర్మిక క్షేత్రాలను ధర్మకర్తలకే వదిలివేయాలని సుప్రీం కోర్టు సూచించింది. ఇందులో ప్రభుత్వ జోక్యం అవసరం లేదని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు ధర్మాసనం సమర్ధిస్తూ .. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది.
Breaking: లోకేష్ పాదయాత్రలో అపశృతి ..సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్న