భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి రీసెంట్ గా రాజీనామా చేసిన సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరికకు ముహూర్తంగా ఖరారు అయ్యింది. ఈ నెల 23వ తేదీ టీడీపీ అధినేత చంద్రబాబు చేతుల మీదుగా ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఈ నెల 23వ తేదీన టీడీపీలో చేరుతున్నట్లు ఆయన స్వయంగా మీడియాకు తెలియజేశారు. తనతో పాటు తన అనుచరులు టీడీపీలో చేరుతున్నట్లు తెలిపారు. అయితే దాదాపు అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, అయిదుగురు ముఖ్యమంత్రుల కేబినెట్ లలో కీలక మంత్రిత్వ శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించడంతో పాటు ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడుగా పని చేసిన కన్నా లక్ష్మీనారాయణ .. టీడీపీలో చేరుతుండటంతో పార్టీలో ఆయనకు ఎటువంటి హోదా లభిస్తుందన్న చర్చ జరుగుతోంది. దీనిపై కన్నా క్లారిటీ ఇస్తూ టీడీపీలో తన స్థానం ఏమిటనే విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో తన పాత్ర ఏమిటీ పార్టీ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు ఏ విధంగా నిర్దేసిస్తే ఆ విధంగా నడుచుకోవడానికి సిద్దంగా ఉన్నానని తెలిపారు కన్నా లక్ష్మీనారాయణ.

ఇదే సందర్భంగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడి చేయడాన్ని కన్నా లక్ష్మీనారాయణ ఖండించారు. డీజీపీ తక్షణమే జోక్యం చేసుకుని రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను పరిష్కరించాలని కోరారు. మరో పక్క వైసీపీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అరాచకాలు చేస్తున్న వారిని వదిలిపెట్టి ప్రజా సమస్యలపై పోరాడే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ కన్నా ధ్వజమెత్తారు. పోలీసులు ఒక వర్గం వారికి అండగా నిలుస్తుందని ఆయన ఆరోపించారు.
అధికారం ఎవరికీ శాశ్వతం కాదని అన్న కన్నా లక్ష్మీనారాయణ.. ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అరాచక పాలన మొదలు పెట్టారని కన్నా ఆరోపించారు. నవరత్నాలు పంచి ప్రజల ఓట్లు కొల్లగొడదామని చూస్తున్నారని అన్నారు. అమరావతిని కాపాడుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలపై ఉందని పేర్కొన్నారు. ఏపిని బీహార్ కంటే అధ్వాన్నంగా తయారు చేస్తున్నారని విమర్శించారు. మళ్లీ అధికారంలోకి వస్తారనే నమ్మకం ఉంటే ఎందుకు ప్రతిపక్షాలను చూసి భయపడుతున్నారని కన్నా ప్రశ్నించారు.
గన్నవరం ఘటనలపై కృష్ణాజిల్లా ఎస్పీ జాషువా స్పందన ఇది