Amaravathi: పట్టురైతులకు ప్రభుత్వం అందించాల్సిన ప్రోత్సాహక బకాయిలు రూ.50కోట్లు వెంటనే అందించి ఆదుకోవాలని పట్టు రైతుల సంఘం రాష్ట్ర నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని నేతలు కలిసి వినతి పత్రం సమర్పించారు. అమరావతి క్యాంప్ కార్యాలయంలో సజ్జలను కలిసిన పట్టు రైతుల సంఘం నాయకులు సిద్దారెడ్డి, పరిగి రాజేశ్, మడకశిర రామకృష్ణారెడ్డి, శంకర లు మాట్లాడుతూ..2019 నుండి నేటి వరకూ చెల్లించాల్సిన ప్రోత్సాహక మొత్తం రేషంషెడ్లు, రోగ నిరోధక మందులు, పరికరాలు, మొక్కలకు అందించాల్సిన రాయితీ మొత్తాన్ని విడుదల చేయాలని కోరారు.

హిందూపురంలోని మార్కెట్ భవనాన్ని పునఃనిర్మాణం చేయాలనీ, పట్టు పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక కమిషనర్ ను నియమించాలని కోరారు. ఈ విషయాలపై సజ్జల సానుకూలంగా స్పందించారని, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు.