AP Skill Development case: ఏపి స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ స్కామ్ కేసులో ఏపీ సీఐడీ అధికారులు సీమెన్స్ కంపెనీ ప్రతినిధి భాస్కర్ ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బాస్కర్ ను సీఐడీ కోర్టులో హజరుపర్చగా న్యాయమూర్తి కీలక ఆదేశాలు జారీ చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో భాస్కర్ రిమాండ్ ను సీఐడీ కోర్టు తిరస్కరించింది. బాస్కర్ ను సీఐడీ అధికారులు విచారించాలనుకుంటే 41 ఏ సీఆర్పీసీ ప్రకారం విచారణ చేయవచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో భాస్కర్ ను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం ఢిల్లీ కోర్టులో హజరుపర్చగా కోర్టు ఆయనకు 36 గంటల ట్రాన్సిట్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను సీఐడీ అధికారులు విజయవాడకు తీసుకువచ్చి కోర్టులో హజరుపర్చారు.

సీమెన్స్ కంపెనీ వద్ద రూ.58 కోట్ల కు కొనుగోలు చేసినట్లు ఇన్ వాయిస్ ను సీఐడీ అధికారులు గుర్తించారు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ విలువను రూ.3,300 కోట్లకు పెంచుతూ భాస్కర్ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేశారని సీఐడీ ఆరోపిస్తున్నది. ఏపికి చెందిన కొంత మంది ప్రమేయంతో ప్రాజెక్టు విలువ ను భాస్కర్ పెంచారని సీఐడీ అనుమానిస్తున్నది. భాస్కర్ చెప్పడం వల్ల ఏపి ప్రభుత్వం రూ.371 కోట్లు చెల్లించిందని అధికారులు చెబుతున్నారు. కొందరు అధికారులతో భాస్కర్ కుమ్మక్కు అయ్యారని తెలిపారు. అతని భార్య అపర్ణను స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ డిప్యూటి సీఈవోగా నియమించారనీ, పక్కా పథకంతో స్కామ్ చేసినట్లుగా సీఐడీ ఆరోపిస్తొంది. ఇప్పటికే ఈ కేసులో సీఐడీ అధికారులు ఎనిమిది మందిని అరెస్టు చేయగా, తాజాగా బాస్కర్ ను అరెస్టు చేశారు.
అయితే సీమెన్స్ కంపెనీలో పని చేస్తున్న బాస్కర్ లబ్దిదారుడు కాదనీ, సీఐడీ అధికారులు ఆయన్ను అన్యాయంగా అరెస్టు చేశారని భాస్కర్ తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ఇప్పటికే బాస్కర్ ను పలు మార్లు సీఐడీ అధికారులు విచారించారనీ, ఆయన విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఈ తరుణంలో బాస్కర్ ను అరెస్టు చేయడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని న్యాయవాది వాదనలు వినిపించారు. సీఐడీ అధికారులు ఆయనపై నమోదు చేసిన సెక్షన్లు వర్తించవని న్యాయవాది తేల్చి చెప్పారు. వాదనలు విన్న న్యాయస్థానం .. బాస్కర్ రిమాండ్ ను తిరస్కరిస్తూ ఆదేశాలు జారీ చేసింది.