ఏపీలోని పలు పట్టణ ప్రాంత రేషన్ కార్డుదారులకు ఇది గుడ్ న్యూస్. ఇప్పటి వరకూ ఏపిలో ఎండీయు (డోర్ డెలివరీ వ్యాన్) ల ద్వారా రేషన్ కార్డు దారులకు పౌర సరఫరాల శాఖ బియ్యం, పంచదార, కందిపప్పు మాత్రమే పంపిణీ చేస్తుండగా, ఈ నెల నుండి సబ్సిడీపై గోధమ పిండి పంపిణీకి చర్యలు చేపట్టింది. ఒక్కో నెల కందిపప్పు, పంచదార పంపిణీ చేయకుండా కేవలం బియ్యం ఒక్కటే పంపిణీ చేస్తుండటంతో కార్డుదారుల నుండి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బియ్యం, కందిపప్పు, పంచదారతో పాటు రెండు కేజీల చొప్పున గోధుమ పిండి సబ్సిడీపై పంపిణీ చేయడానికి చర్యలు చేపట్టింది.

Read More: Union Budget 2023: వస్తువుల ధరలు పెరిగేవి .. తగ్గేవి ఇవే .. పేదలకు బంగారం కొనుగోలు భారమే
గోధుమ పిండి ధర ప్రస్తుతం మార్కెట్ లో కేజీ రూ.40లు వరకూ ఉండగా, కేజీ గోధుమ పిండి ప్యాకెట్ 16 ల చొప్పున కార్డుకు రెండు కేజీల చొప్పున పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. అయితే ఫిబ్రవరి నెలలో మాత్రం ఉత్తరాంధ్ర లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, అనకాపల్లి జిల్లాలోని మున్సిపాలిటీ పట్టణ ప్రాంతాల్లో మాత్రమే పంపిణీకి చర్యలు చేపట్టారు. పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఈ పంపిణీ కార్యక్రమాన్ని విశాఖ పట్టణంలో బుధవారం ప్రారంభించారు. నగరంలోని లబ్దిదారులకు గోధుమ పిండి ప్యాకెట్ లను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఇక చిరు ధాన్యాల పంపిణీపైనా పౌర సరఫరాల శాఖ దృష్టి సారించింది. రాగులు, జొన్నలను కూడా బియ్యం బదులుగా పంపిణీ చేయాలని భావిస్తొంది. ఇందుకు గానూ కార్డుదారుల అభిప్రాయాలను గత నెలలో స్వీకరించింది. త్వరలో రాగులు, జొన్నలు కూడా పంపిణీ చేయనున్నది.
Read More: టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ..ఎందుకంటే..?