అమరావతి రాజధాని కేసుపై సుప్రీం కోర్టులో ఇవేళ (మంగళవారం) విచారణ జరగనున్నది. అమరావతి కేసులతో పాటు రాష్ట్ర విభజన కేసులను జస్టిస్ జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నంతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించనున్నది. ఈ విచారణ సందర్భంగా ఇవేళ వాదనలే కొనసాగుతాయా.. ఉత్తర్వులు ఏమైనా వెలువడతాయా అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓ పక్క సుప్రీం కోర్టులో కేసు నడుస్తుండగానే విశాఖ పరిపాలనా రాజధాని అవుతోందనీ, త్వరలో తాను విశాఖ షిప్ట్ అయి అక్కడి నుండే పాలన సాగించనున్నట్లు ఏకంగా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పలు సందర్భాల్లో పేర్కొనడం, మంత్రులు, వైసీపీ పెద్దలు కూడా న్యాయపరమైన చిక్కులు తొలగిపోయి విశాఖ పరిపాలనా రాజధాని అవుతుందని చెబుతుండటంతో సుప్రీం కోర్టు తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది.

అమరావతిలోనే రాజధాని కొనసాగించాలన్న హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని నిర్ణయించే అధికారం లేదని హైకోర్టు పేర్కొనడాన్ని ఏపి శాసనసభ కూడా తప్పుబట్టింది. రద్దు చేసిన చట్టాలపై తీర్పు ఇవ్వడం సహేతుకం కాదని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. రాజ్యాంగం ప్రకారం మూడు వ్యవస్థలు తమతమ అధికార పరిధుల్లో పని చేయాలని, శాసన, పాలన వ్యవస్థ అధికారంలోకి న్యాయ వ్యవస్థ చొరబడటం రాజ్యాంగ మౌలిక వ్యవస్థకు విరుద్దమని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ లో పేర్కొంది. తమ రాజధానిని రాష్ట్రాలే నిర్ణయించుకోవడం సమాఖ్య వ్యవస్థకు నిదర్శనమని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వానికి తమ రాజధాని నిర్ణయించుకునే సంపూర్ణ అధికారం ఉంటుందని పిటిషన్ లో విన్నవించింది.
రాజధానిపై శివరామ కృష్ణన్ కమిటీ నివేదిక, జీఎన్ రావు కమిటీ నివేదిక, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు నివేదిక, హైపపర్డ్ కమిటీ నివేదికలను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదని, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాజధాని కేవలం అమరావతిలో కేంద్రీకృతం చేయకుండా వికేంద్రీకరణ చేయాలని ఈ నివేదికలు సూచించాయని తెలిపింది. 2014 – 19 మధ్య కేవలం అమరావతి ప్రాంతంలో పది శాతం మౌలిక వసతుల పనులు మాత్రమే తాత్కాలికంగా జరిగాయని వివరించింది. మరో పక్క ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. విభజన చట్టం ప్రకారం గతంలోనే ఏపి రాజధాని అమరావతిగా నోటిఫై అయ్యిందని, మూడు రాజధానుల ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర అనుమతి తీసుకోలేదంటూ అఫిడవిట్ లో పేర్కొంది. ఈ పిటిషన్ పై ఇంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది అత్యవసరంగా విచారణ జరపాలని కోరినా ధర్మాసనం తిరస్కరించింది. హైకోర్టు తీర్పును యదాథదంగా అమలు చేయాలని అమరావతి రైతుల తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పు ఏ విధంగా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.
రాపాక సారూ.. ఎమిటీ వ్యాఖ్యలు..! ఇది సోషల్ మీడియా యుగం.. ఆడేసుకుంటారు..!!