Supreme Court: రాష్ట్రాల బోర్డు పరీక్షల రద్దు పిటిషన్ పై సుప్రీం కోర్టులో నేడు విచారణ జరిగింది. పరీక్షల రద్దుపై అఫిడవిట్ రెండు రోజుల్లో సమర్పించాలని ఏపి ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. పరీక్షల నిర్వహణపై అన్ని రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నా ఏపి ఎందుకు నిర్ణయం తీసుకోలేదని న్యాయస్థానం ప్రశ్నించింది. ఏపికి ఎందుకు మినహాయించాలో చెప్పాలని నిలదీసింది.

12వ తరగతి పరీక్షలు నిర్వహిస్తారా లేదా స్పష్టంగా చెప్పాలని ఏపిని ఆదేశించింది. ఇన్ని రోజులైనా అఫిడవిట్ ఎందుకు వేయలేదని ప్రభుత్వ న్యాయవాదిని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఏపి నుండి స్పష్టత లేదని అసహనం వ్యక్తం చేసింది. ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది.
పరీక్షలు రద్దు చేయని ఏపి సహా నాలుగు రాష్ట్రాలకు సుప్రీం ధర్మాసనం గురువారం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పరీల రద్దుకు సిద్ధంగా ఉన్నట్లు అస్సోం, పంజాబ్, త్రిపుర బోర్డులు వెల్లడించాయి. 11వ తరగతి పరీక్షలు సెప్టెంబర్ లో నిర్వహిస్తామని కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది.
కాగా పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం అనుకూలంగా ఉందని ఏపి ప్రభుత్వ న్యాయవాది తెలియజేశారు. దీనిపై విద్యార్థుల భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. పరీక్ష హాలులో కేవలం 15 నుండి 20 మందిని మాత్రమే అనుమతిస్తున్నామని, విద్యార్థుల మధ్య కనీసం అయిదు అడుగుల భౌతిక దూరం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటే పరీక్షలకు అనుమతి ఇస్తామని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. కోర్టుకు తెలిపిన అంశాలను రేపు అఫిడవిట్ దాఖలు చేస్తామని ఏపి ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. కేసు విచారణను సుప్రీం కోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.