రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం కల్గించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే వివేకా హత్య కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసినందున .. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసే విషయంపైనా తెలంగాణ హైకోర్టే నిర్ణయం తీసుకుంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐ స్వీకరించకముందే ఎర్ర గంగిరెడ్డి ని ఘటనా స్థలంలో సాక్షాధారాలు మాయం చేశారన్న అభియోగంపై పోలీసులు అరెస్టు చేసి సిట్ దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే బెయిల్ పొందారు. ఆ తర్వాత హైకోర్టు ఆదేశాలతో సీబీఐ విచారణ చేస్తున్న క్రమంలో ఈ కేసులో నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి కి మంజూరైన బెయిల్ రద్దు చేయాలని సీబీఐ తొలుత ఏపి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే సీబీఐ వాదనలకు ఏకీభవించని హైకోర్టు ఆ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. ఆ తర్వాత సీబీఐ .. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. రాష్ట్ర పోలీసుల చేతిలో విచారణ సమయంలోనే ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ మంజూరైందని సీబీఐ వాదనలు వినిపించింది. ఈ సందర్భంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
నాన్ బెయిలబుల్ నేరానికి పాల్పడిన సందర్భంలో చార్జిషీటు దాఖలు కాలేదన్న కారణంతో కేసులోని మెరిట్స్ ను పరిగణలోకి తీసుకోకుండా డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయడం తగదని సుప్రీం కోర్టు తెలిపింది. కేసులోని మెరిట్స్ ఆధారంగా బెయిల్ అంశంపై మరో సారి విచారణ చేపట్టాలని సూచించింది, డిఫాల్ట్ బెయిల్ రద్దు కాదంటూ ఏపి హైకోర్టు తీర్పును ఇవ్వడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. డిఫాల్ట్ బెయిల్ పొందిన వ్యక్తి విచారణకు సహకరించని పక్షంలో బెయిల్ రద్దు చేసే అవకాశం ఉంటుందని సుప్రీం కోర్టు ధర్మాసనంలో తీర్పులో పేర్కొంటూ తెలంగాణ హైకోర్టుకు బెయిల్ రద్దు పిటిషన్ ను బదిలీ చేసింది. దీంతో ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ఈ పిటిషన్ పై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో త్వరలో విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి.