ఏపి హైకోర్టుకు నూతనంగా ఇద్దరు అదనపు న్యాయమూర్తులు నియమితులైన సంగతి తెలిసిందే. అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, జస్టిస్ వెనుతురుమల్లి గోపాల కృష్ణారావు శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. నేలపాడులోని ఏపి ఉన్నత న్యాయ స్థానం మొదటి కోర్టు హాల్ లో శుక్రవారం జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తొలుత భారత రాష్ట్రపతి జారీచేసిన నోటిఫికేషన్ ఆర్డరును రిజిస్ట్రార్ జనరల్ లక్ష్మణరావు చదివి వినిపించారు. తదుపరి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, జస్టిస్ వెనుతురుమల్లి గోపాల కృష్ణారావు లచే అదనపు న్యాయమూర్తులుగా హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేయించారు.

న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హారీ, జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ ఎన్.జయసూర్య, డా.జస్టిస్ కె.మన్మధరావు, జస్టిస్ బి.ఎస్.భానుమతి, జస్టిస్ ఎన్.వెంకటేశ్వర్లు, జస్టిస్ సుబ్బారెడ్డి సత్తి, జస్టిస్ రవి చీమలపాటి, జస్టిస్ ఏ.వి.రవీంధ్రబాబు, జస్టిస్ వి.ఆర్.కె.కృపా సాగర్, జస్టిస్ శ్రీనివాస్ ఉటుకూరు, అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఇద్దరు అదనపు న్యాయమూర్తులు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వారు కావడం విశేషం. జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప గుంటూరు జిల్లా తెనాలి వాసి. ఈమె తల్లిదండ్రులు బాల త్రిపుర సుందరి, పివికే శాస్త్రి. జ్యోతిర్మయి డిగ్రీ వరకూ తెనాలిలో చదువుకున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుండి లా పూర్తి చేశారు. 2008లో జ్యూడీషియల్ సర్వీస్ లోకి ప్రవేశించారు. ఫ్యామిలీ, ఎస్సీ, ఎస్టీ, సీబీఐ కోర్టు, వ్యాట్ ట్రైబ్యునల్ జడ్జిగా బాధ్యతలు నిర్వహించారు. విశాఖ, ప్రకాశం జిల్లాలకు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించారు. ఇటీవలి కాలం వరకూ తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు.
ఇక జస్టిస్ వి గోపాలకృష్ణారావు స్వగ్రామం ఉమ్మడి కృష్ణాజిల్లా చల్లపల్లి.య తల్లిదండ్రులు కోటేశ్వరరావు, సోమయ్య. ఆవనిగడ్డ బార్ అసోసియేషన్ పరిధిలో గోపాలకృష్ణ న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 1994లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైయ్యారు. 2007లో సీనియర్ సివిల్ జడ్జిగా, 2016లో అదనపు జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. అదనపు జిల్లా జడ్జిగా శ్రీకాకుళం, తిరుపతిలో న్యాయసేవలు అందించారు. ఇటీవలి వరకూ గుంటూరు ఒకటవ అదనపు జిల్లా జడ్జిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన కుమారుడు వి రఘునాథ్ ఇటీవలే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైయ్యారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా ఆత్మకూరు కోర్టులో జడ్జిగా న్యాయసేవలు అందిస్తున్నారు.
Breaking: లోకేష్ పాదయాత్రలో అపశృతి ..సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్న
అమిత్ షా తో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ … టీ కాంగ్రెస్ పై కీలక వ్యాఖ్యలు