MLA Sridevi: ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని నలుగురు ఎమ్మెల్యేలు అనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలను వైసీపీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. పార్టీ నుండి బహిష్కరణకు గురైన ఈ నేతలు వరుసగా మీడియా ముందు గళం విప్పుతున్నారు. పార్టీపై, ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆదివారం హైదరాబాద్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి దంపతులు మీడియా సమావేశంలో మాట్లాడారు. డబ్బులకు అమ్ముడుపోయామన్న ఆరోపణలను వారు తీవ్రంగా ఖండించారు. మూడు రోజులుగా వైసీపీ గుండాలు తనను వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే శ్రీదేవి. వైసీపీ గుండాలు అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నారని వాపోయారు.

తాను అజ్ఞాతంలోకి వెళ్లిపోయానంటూ ప్రచారం చేస్తున్నారనీ, హైదరాబాద్ అనేది సహారా ఏడారా..? లేదంటే దుబాయ్ లోని అండర్ గ్రౌండా.. ? నేనే ఏమైనా మాఫియా గ్యాంగా..? టెర్రరిస్టునా..? అజ్ఞాతంలోకి వెళ్లడానికి అని శ్రీదేవి ప్రశ్నించారు. ప్రస్తుతం తనకు రక్షణ లేకపోవడం వల్ల ఏపికి వెళ్లడం లేదని అన్నారు. తనను పార్టీ నుండి బయటకు పంపాలని నిర్ణయించుకునే కుట్రలు చేశారనీ, ఇప్పుడు ఓటుకు నోటు తీసుకున్నారని ముద్ర వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజం నిలకడగా తెలుస్తుందన్నారు. జగన్ దెబ్బకు తమ మైండ్ బ్లాంక్ అయ్యిందని అన్నారు. ఇక తాను స్వతంత్ర ఎమ్మెల్యేగా రాజధాని అమరావతి రైతులకు మద్దతుగా నిలుస్తానని చెప్పారు.
ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీతో తమకు సంబంధం లేదని తెలిపారు శ్రీదేవి. భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకున్నా మీడియాకు తెలియజేస్తానని చెప్పారు. సీఎం జగన్ పై ఇప్పటికీ తనకు గౌరవం ఉందన్నారు. ఆయన వద్దకు తన పట్ల తప్పుడు సమాచారాన్ని చేరవేశారని అన్నారు. తాను ఓటుకు డబ్బులు తీసుకోలేదని కాణిపాకంతో సహా ఎక్కడైనా ప్రమాణం చేయడానికి సిద్దమేననీ వారు ప్రమాణం చేయడానికి సిద్దమా అని ప్రశ్నించారు. తన భార్యపై వేసిన నిందను రుజువు చేయాలని, అలా చేస్తే అంత మొత్తం తన సొంత డబ్బులు ఇస్తానని పేర్కొన్నారు శ్రీదేవి భర్త డాక్టర్ కె శ్రీధర్.