Chandra Babu: దేశ వ్యాప్తంగా కరోనామహమ్మారి మరో సారి పంజా విప్పింది. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టినప్పటికీ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తెలంగాణలో రోజు వారి కేసుల సంఖ్య 3వేల వరకూ నమోదు అవుతుండగా, ఏపీలో రోజు వారి కొత్త కేసులు అయిదు వేల వరకూ ఉంటున్నాయి. సామాన్యులు మొదలు కొని రాజకీయ నేతలు, ప్రముఖులు, సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. ఇంట్లో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయితే వారి కుటుంబంలోని మిగిలిన వారికి కరోనా సోకుతోంది.

Chandra Babu: చంద్రబాబుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తాజాగా టీడీపీ అధినేత, ఏపి ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఆయన తనయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు నిన్న కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు కూడా స్వల్ప లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షలో ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. హోం ఐసోలేషన్ లోనే ఉండి చికిత్స పొందుతున్నట్లు చంద్రబాబు తెలిపారు.
వారందరూ పరీక్షలు చేయించుకోవాలి
తనతో వారం రోజుల నుండి కాంటాక్ట్ అయిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని చంద్రబాబు సూచించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, స్వల్ప లక్షణాలే ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. కాగా ఇటీవల చంద్రబాబు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నేత చంద్రయ్య హత్యకు గురి కాగా అక్కడకు వెళ్లి పాడె మోసిన సంగతి తెలిసిందే.