TDP BJP: రాజకీయాల్లో శాశ్వత శతృవులు, శాశ్వత మితృలు ఉండరు అన్న నానుడి ఉండనే ఉంది. వాజ్ పేయ్ హయాంలో చంద్రబాబు బీజేపీతో కలిశారు, ఆ తర్వాత బీజేపీ మతతత్వ పార్టీ అంటూ బయటకు వచ్చారు. ఆ తర్వాత 2014 ఎన్నికలకు ముందు మోడీతో కలిశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో నాలుగేళ్లు భాగస్వామిగా ఉన్నారు. 2018లో మరల ఎన్డీఏ నుండి బయటకు వచ్చారు. యూపీఏతో జత కట్టారు. ఎన్నికల సమయంలో మోడీని రాజకీయంగానే కాక వ్యక్తిగతంగానూ విమర్శించారు చంద్రబాబు. చంద్రబాబును మోడీ, షాలు తీవ్రంగానే విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును ఏటీఎంగా వాడుకున్నారంటూ తీవ్ర స్థాయి ఆరోపణలు చేశారు. ఆ సమయంలోనే చంద్రబాబుకు బీజేపీ తలుపులు మూసేసినట్లు అమిత్ షా ప్రకటించేశారు.

2019 ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూసిన తర్వాత చంద్రబాబు తత్వం భోదపడినట్లు ఉంది. ఆ తర్వాత బీజేపీ స్నేహ హస్తం అందుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ రాష్ట్ర, కేంద్ర బీజేపీలు ఇప్పటి వరకూ అవకాశం ఇవ్వలేదు. అయినప్పటికీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బేషరతుగా ఎన్టీఏ అభ్యర్ధులకు ఓటు వేసి అనధికార మిత్రపక్షమే అన్నభావన కల్గించారు చంద్రబాబు. ఏపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్శింహరావు, రాష్ట్ర వ్యవహారాల సహా ఇన్ చార్జి సునీల్ ధయోధర్ లాంటి వాళ్లు మా పొత్తు జనసేనతోనే అని, చంద్రబాబుతో కలిసేది లేదని కూడా పలు సందర్భాల్లో వెల్లడించారు.
అయినప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం రాష్ట్రంలో బీజేపీకి ఓట్లు, సీట్లు లేకపోయినా కేంద్ర ప్రభుత్వ సహకారం, స్నేహం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఓ జాతీయ మీడియా న్యూస్ ఛానల్ నిర్వహించిన చర్చా వేదికలో చంద్రబాబే తన మనసులో మాటను బయటపెట్టడంతో పాటు మోడీని ప్రశంసలతో ముంచెత్తారు. మరల ఎన్డీఏతో కలిసే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు నిర్మోహమాటంగా సమాధానం చెప్పేశారు చంద్రబాబు. రిపబ్లిక్ టీవీ నిర్వహించిన చర్చా వేదికలో పాల్గొన్న చంద్రబాబును ఎన్డీఏకు సపోర్టు చేసే అవకాశం ఉందా అని అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. దేశాభివృద్ధి కోసం ప్రధాని చేసే పనులకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని కూడా స్పష్టం చేశారు. ఎన్డీఏలో భాగస్వామి కావడమనేది మేటరాఫ్ టైమేనని అన్నారు.
అభివృద్ధి విషయంలో ప్రధాని మోడీ ఏ ఆలోచనతో ఉన్నారో తానూ ఆదే ఆలోచనతో ఉన్నానని చంద్రబాబు పేర్కొన్నారు. ఇదే సందర్భంలో ప్రధాని మోడీని పొగడ్తలతో ముంచెత్తారు. ప్రధాని ఆలోచనలకు అనుగుణంగా తన పరిధి మేరకు కలిసి పని చేయడానికి సిద్దమని ప్రకటించించారు. గతంలోనూ తాను మోడీ పాలసీలను వ్యతిరేకించలేదని, ప్రత్యేక హోదా సెంటిమెంట్ గా మారిందని, దాని పై మాత్రమే తాను అప్పట్లో పోరాటం చేసినట్లుగా వివరించారు. పిలిస్తే వెళ్లి చంకన ఎక్కి కూర్చోవడానికి సిద్దంగా ఉన్నా చంద్రబాబుకు అమిత్ షా తలుపులు తెరుస్తారా అన్న కామెంట్స్ వినబడుతున్నాయి. అయితే రిపబ్లిక్ టీవీ చర్చా వేదికలో చంద్రబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. దీనిపై ఏపి బీజేపీ నాయకులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది వేచి చూడాలి.
YS Sharmila: వైఎస్ షర్మిలకు బెయిల్ మంజూరు .. ఇవీ షరతులు