రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన పొత్తుతో పోటీ చేస్తాయని వార్తలు వినబడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో తాను ప్రతినిధ్యం వహించిన సీటును పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు రావడంతో ఆ నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైసీపీలో చేరేందుకు సిద్దమైయ్యారు. అధికార వైసీపీలో చేరితే ఎమ్మెల్సీ హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామ క్రమంలో ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలో ఆందోళన మొదలైంది. దీంతో ఆ ఎమ్మెల్యే హుటాహుటిన వైసీపీ కేంద్ర కార్యాలయానికి పరుగులు తీశారు.

విషయంలోకి వెళితే.. కైకలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జయమంగళం వెంకట రమణ వైసీపీలో చేరనున్నారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో కలిసి తాడేపల్లికి వెళ్లి సీఎం జగన్మోహనరెడ్డి ను వెంకట రమణ కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. జగన్ ఆయనకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చినట్లు సమాచారం. అదే విదంగా ఆయనకు ప్రభుత్వం నలుగురు గన్ మెన్ లతో భద్రతకు ఆదేశాలు ఇచ్చారు. 2009 ఎన్నికల్లో జయమంగళం వెంకట రమణ టీడీపీ తరపున కైకలూరు నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా ఆ సీటును బీజేపీకి కేటాయించగా, కామినేని శ్రీనివాస్ గెలిచారు. టీడీపీ హయాంలో మంత్రిగా కూడా పని చేశారు.
2019 ఎన్నికల్లో మరో సారి పోటీ చేసిన జయమంగళం వెంకట రమణ.. వైసీపీ అభ్యర్ధి దూలం నాగేశ్వరరావు (డీఎన్ఆర్) చేతిలో పరాజయం పాలైయ్యారు. ఇక రాబోయే ఎన్నికల్లో పొత్తులో భాగంగా కైకలూరు నియోజకవర్గం జనసేనకు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో జయమంగళం వెంకట రమణ పార్టీ మారేందుకు సిద్దమైయ్యారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకు సొంత పార్టీ నేతల నుండే వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో జయమంగళం వెంకట రమణ పార్టీలో చేరనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు హుటాహుటిన పార్టీ కేంద్ర కార్యాలయానికి బయలుదేరి వెళ్లినట్లు తెలుస్తొంది.
ఆ తొమ్మిది నియోజకవర్గాలపైనే టీడీపీ ఫోకస్ .. ఎందుకంటే..?