TDP: నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రమోహన్ రెడ్డి, అనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. ఈ నెల 13వ తేదీ నుండి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగనున్న నేపథ్యంలో ఈ లోపుగానే వీరిని పార్టీ చేర్చుకునేందుకు టీడీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే ఆనం రామనారాయణరెడ్డి రీసెంట్ గా టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి మాట్లాడి వచ్చారు.

మరో పక్క ఈ వేళ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డి బద్వేలు నియోజకవర్గం అల్లూరు లో నారా లోకేష్ యువగళం పాదయాత్రకు సంఘీభావం పలికారు. అనంతరం మేకపాటి మీడియాతో మాట్లాడుతూ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించామన్నారు. త్వరలో టీడీపీలో చేరతానని చెప్పారు. తనతో పాటు నెల్లూరు జిల్లా నుండి మరో ఇద్దర ఎమ్మెల్యేలు టీడీపీ లో చేరతారని తెలిపారు. ఉదయగిరిలో పాదయాత్ర ప్రవేశిస్తున్నందున లోకేష్ ను కలిసినట్లు మేకపాటి పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర విజయవంతం చేస్తానని మేకపాటి తెలిపారు. టికెట్ కోసం జగన్ ను అయిదు సార్లు కలిసినా లాభం లేదనీ, ఎమ్మెల్సీ పదవి మాత్రమే ఇస్తానని చెప్పారనీ, అందుకే బయటకు వచ్చేశానని అన్నారు. టికెట్ ఇచ్చినా .. ఇవ్వకున్నా టీడీపీ కోసం పని చేస్తానని తెలిపారు.

మరో వైపు నెల్లూరులో ఇవేళ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని, ఆ తర్వాత ఎమ్మెల్యే అనం రామనారాయణరెడ్డిలను టీడీపీ మాజీ మంత్రి అమర్నాధ్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, టీడీపీ నేతలు వేమిరెడ్డి పట్టాభి కలిశారు. టీడీపీలోకి రావాలంటూ ఆహ్వానం పలికారు. ఈ నెల 13 నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగనున్న నేపథ్యంలో విజయంతం అయ్యేందుకు టీడీపీ వ్యూహాత్మకంగా ఈ ముగ్గురు వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలకు పార్టీ కండువాలు కప్పేందుకు సిద్దమైంది. అయితే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు నారా లోకేష్ పాదయాత్రలో టీడీపీ తీర్ధం పుచ్చుకుంటారా .. లేక పార్టీ అధినేత చంద్రబాబు వద్దకు వెళ్లి పార్టీ కండువాలు కప్పుకుంటారా అనేది ఇంకా తెలియరాలేదు. అయితే రెండు మూడు రోజుల్లోనే వీరి పార్టీ చేరిక ముహూర్తం ఫిక్స్ అవుతుందనే మాట వినబడుతోంది.
Visakhapatnam: లిఫ్ట్ లో చిక్కుకున్న ఏపీ మంత్రి.. కొద్ది సేపు ఆందోళన
