టీడీపీ నేతలకు తరచు విజయవాడ ఎంపీ కేశినేని నాని షాక్ లు ఇస్తూనే ఉన్నారు. సోదరుడు కేశినేని చిన్నితో ఆయనకు విభేదాలు ఉండగా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చిన్నిని పలువురు పార్టీ నేతలు ప్రోత్సహిస్తున్నారు. ఆయన సహకారం తీసుకుంటున్నారు. దీంతో పలు మార్లు తన అసంతృప్తిని కేశినేని నాని బహిరంగంగానే వ్యక్తం చేశారు. తాజాగా మరో సారి వార్తల్లో నిలిచారు కేశినేని నాని. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం తోటరావులపాడు గ్రామంలో తన నియోజకవర్గ అభివృద్ధి నిధులు రూ.47 లక్షలతో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ ను ఆదివారం స్థానిక వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు తో కలిసి ఎంపీ కేశినేని నాని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చర్చకు దారి తీశాయి. వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య కేశినేని నాని ఫోటోతో స్వాగత ఫ్లెక్సీలు భారీగా ఏర్పాటు చేయడం నియోజకవర్గంలో హాట్ టాపిక్ అయ్యింది. దానికి తోడు ఎమ్మెల్యే, ఎంపీలు ఇద్దరు పరస్పరం అభినందనలు తెలియజేసుకోవడం చర్చనీయాంశం అయ్యింది. విజయవాడ పార్లమెంట్ పరిధిలో కీలక నియోజకవర్గమైన నందిగామలో టీడీపీ ఇన్ చార్జి, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వర్సెస్ వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గా పొలిటికల్ వార్ కొనసాగుతున్న నేపథ్యంలో వైసీపీ నేతలతో కలిసి టీడీపీ ఎంపీ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ఎమ్మెల్యే బాగా పని చేస్తున్నారంటూ ప్రశంసించడం టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. తామిద్దరం వేర్వేరు పార్టీలు అయినా ప్రజా సమస్యల విషయంలో కలిసి పని చేస్తున్నామని చెప్పుకొచ్చారు. రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం కావాలని, మిగిలిన సమయాల్లో ప్రజా సమస్యలే అజెండాగా పని చేయాలి ఎంపి కేశినేని సూచించారు. టాటా ట్రస్ట్ ద్వారా కేశినేని నాని అనేక సేవా కార్యక్రమాలు చేశారంటూ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు ప్రశంసించారు.

అధికార విపక్ష పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం హర్షించదగిన పరిణామమే అయినప్పటికీ ప్రస్తుత రాజకీయ వాతావరణంలో అనేక అనుమానాలకు దారి తీయడం జరుగుతుంటాయి. పార్టీ టికెట్ ఇవ్వకపోతే కేశినేని నాని రాబోయే ఎన్నికల్లో అవసరమైతే స్వతంత్ర అభ్యర్ధిగా అయినా పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నారనీ, అందుకే పార్టీ తో సంబంధం లేకుండా సొంత ఇమేజ్ పెంచుకునే పనిలో ఉన్నారనే మాట వినబడుతోంది. గత ఎన్నికల్లోనూ క్రాస్ ఓటింగ్ మూలంగా కేశినేని నాని విజయం సాధించిన సంగతి తెలిసిందే. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ సిగ్మెంట్ లలో టీడీపీ అభ్యర్ధులు పరాజయం పాలైనా కేశినేని నాని మాత్రం విజయం సాధించారు.