TDP: టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసు సీఐడీ అధికారులు ఈ నెల 9వ తేదీన అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సహజంగా పార్టీ అధినేతను అరెస్టు చేస్తే ఆ పార్టీ శ్రేణులకు బాధ ఉంటుంది. ఆందోళన ఉంటుంది. ఆ కారణంగా వారు రోడ్డు ఎక్కి ఆందోళనలు, నిరసనలు కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ విశాఖలో కొందరు తెలుగు తమ్ముళ్లు చేసిన పని రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంశం అవుతోంది. విశాఖలోని పలువురు తెలుగు తమ్ముళ్లు మాత్రం చంద్రబాబును అరెస్టు చేస్తే మాకేటిమి అన్నట్లుగా భావించి టూర్ కు చెక్కేయడం హాట్ టాపిక్ అయ్యింది. చంద్రబాబును అరెస్టు చేస్తే ఆ పార్టీ నేతలకు ఏమాత్రం బాధ లేదా అన్న మాటలు వినబడుతున్నాయి.

విశాఖ జీవీఎంసీలో 99 మంది కార్పోరేటర్ లు ఉండగా వారిలో 81 మంది ఈ నెల 10వ తేదీన అధ్యయన యాత్ర పేరుతో శ్రీనగర్ టూర్ కు వెళ్లారు. వీరిలో టీడీపీకి చెందిన కార్పోరేటర్ లు ఉన్నారు. ఈ టూర్ కి వామపక్షాలు, జనసేన పార్టీకి చెందిన కార్పోరేటర్లు దూరంగా ఉన్నారు. చంద్రబాబు అరెస్టు వార్త తెలిసి జీవీఎంసీ లో టీడీపీ ప్లోర్ లీడర్ తో పాటు మరో ముగ్గురు నలుగురు కార్పోరేటర్ లు తమ టూర్ ను రద్దు చేసుకున్నారని సమాచారం.
మరి కొందరు టీడీపీ కార్పోరేటర్ లు యధావిధిగా విమానం ఎక్కి శ్రీనగర్ టూర్ కు వెళ్లారు. ముందుగా నిర్ణయించుకున్న టూర్ ను అర్ధాంతరంగా క్యాన్సిల్ చేసుకోవడం దేనికి అని ఆ తెలుగు తమ్ముళ్లు భావించారు. వారు టూర్ కు వెళ్లడమే కాకుండా అక్కడ ఎంజాయ్ చేస్తున్న పోటోలను తమ వాట్సప్ స్టాటస్ లో పెట్టడం విమర్శలకు దారి తీస్తుందని అంటున్నారు. ఓ పక్క వారి పార్టీ నాయకుడు అరెస్టు అయి జైలులో ఉంటే వారు మాత్రం ఎంచక్కా టూర్ కు వెళ్లడమే కాకుండా ఇలా చేయడం ఏమిటంటూ చెవులు కొరుక్కుంటున్నారు.
ఓ పక్క విశాఖ జిల్లాలోనే రీసెంట్ గా పలువురు తెలుగు తమ్ముళ్లు అత్యుత్సాహంతో చంద్రబాబుకు కోర్టు రిమాండ్ ఇవ్వకుండా విడుదల చేసిందని భావించి బాణాసంచా కాల్సి సంబరాలు చేసుకోవడం విమర్శలకు దారి తీయగా, పలువురు కార్పోరేటర్ లు ఈ తరుణంలో అద్యయన యాత్ర పేరుతో జరిగే టూర్ కు వెళ్లడం విమర్శలకు దారి తీసింది. ఈ నెల పదవ తేదీన శ్రీనగర్ టూర్ కు వెళ్లిన జీవీఎంసీ కార్పోరేటర్ లు వారం రోజులు అక్కడ గడిపి రానున్నారు.