శ్రీకాకుళం జిల్లా వైసీపీలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. అనూహ్యంగా అభ్యర్ధి మార్చేసింది వైసీపీ. టెక్కలిలో ఈ సారి ఎలాగైనా రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హవాకు చెక్ పెట్టాలని భావించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి .. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు గతంలోనే నియోజకవర్గ సమన్వయ కర్తగా నియమించారు. గత నెలలో మూలపేట పోర్టు శంకుస్థాపనకు వచ్చిన సమయంలో సీఎం జగన్.. నౌపడలో నిర్వహించిన బహిరంగ సభలోనే దువ్వాడ శ్రీనివాస్ అభ్యర్ధిగా ప్రకటించారు. శ్రీనివాస్ ను మీ చేతుల్లో పెడుతున్నాను, గెలిపించి ఎమ్మెల్యేగా పంపాలంటూ ప్రజలకు చెప్పారు.

అయితే నెలా పది రోజుల్లోనే అభ్యర్ధి మార్పునకు అధిష్టానం చర్యలు తీసుకోవడం నియోజకవర్గంలో హాట్ టాపిక్ అయ్యింది. టెక్కలి వైసీపీ అభ్యర్ధిగా తాను బరిలో ఉండటం లేదనీ, తన భార్య వాణి పోటీ చేస్తారని దువ్వాడ శ్రీనివాస్ ప్రకటించారు. శుక్రవారం టెక్కలిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ మేరకు ఆమోదం తెలిపారని చెప్పారు. తననే అభ్యర్ధిగా గతంలో ప్రకటించినా, తాను ఎమ్మెల్సీగా ఉన్నందున మహిళా సాధికారతను దృష్టిలో పెట్టుకుని అభ్యర్ధి మార్పు ప్రతిపాదన అధిష్టానం ముందు ఉంచాననీ, అయితే ముందు సీఎం జగన్ ఒప్పుకోలేదని, మరల చెప్పగా తన భార్య అభ్యర్ధిత్వంపై ఓకే చెప్పారన్నారు.

అయితే దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణియే ఎమ్మెల్యే అభ్యర్ధిత్వం ఆశించి పంతం పట్టారని, ఆమె నేరుగా వెళ్లి సీఎం జగన్ ను కలిసి తన అభిప్రాయాన్ని తెలియజేశారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను భార్యభర్తలు ఖండించారు. అనూహ్యంగా అభ్యర్ధి మార్పు అంశం నియోజకవర్గ వైసీపీలో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.
CM Jagan: ఢిల్లీలో ఏపీ సీఎం వైఎస్ జగన్ .. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ