Janasena: తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీజేపీతో కలిసి పోటీ చేయాలా లేక ఒంటరి పోరు చేయడమా అనే సందిగ్దంలో జనసేన ఉంది. జనసేన ఎన్డీఏ భాగస్వామ్యంగా ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీతో కలిసి ఉమ్మడిగా కార్యక్రమాలు నిర్వహించిన దాఖలాలు లేవు. హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికల సమయంలో జనసేన పోటీ చేయాలని భావించి నేతలు నామినేషన్ లకు సిద్దమైనా చివరి నిమిషంలో బీజేపీ నేతల ఒత్తిడితో జనసేన డ్రాప్ అయింది. బీజేపీకి మద్దతు ఇచ్చింది. అయితే ఇంత వరకూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ ఎన్నికల ప్రచార సభల్లో ఎక్కడా పాల్గొనలేదు.
ఈ క్రమంలో తెలంగాణలోని సుమారు 30 నుండి 35 నియోజకవర్గాల్లో జనసేన ఒంటరిగా పోటీ చేయాలని భావిస్తొంది. జనసేన క్యాడర్ బలంగా ఉన్న నియోజకవర్గాలను గుర్తించి కమిటీలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్ లోని జనసేన తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యాలయంలో మంగళవారం రాత్రి జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల్లో జనసేన పోటీ చేయాల్సిందేనని పలువురు జనసేన నేతలు పవన్ కళ్యాణ్ కు విజ్ఞఫ్తి చేశారు. ఎన్నికల సన్నద్దతపై పోటీ చేయదలుచుకున్న అభ్యర్ధుల అభిప్రాయాలను పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు.
ఎన్నాళ్ల నుండో అవకాశం కోసం ఎదురుచూస్తున్నామనీ, ఈ సారి పోటీ చేయకపోతే తెలంగాణ పార్టీ ఎదుగుదలను చేతులారా అపుకున్నట్లేనని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోతే ప్రజల ముందుకు భవిష్యత్తులో బలంగా వెల్లడం కష్టమేననీ, క్యాడర్ నిరుత్సాహానికి గురవుతారని నేతలు స్పష్టం చేశారు. నేతల అభిప్రాయాలను తెలుసుకున్న పవన్ కళ్యాణ్ క్షేత్ర స్థాయిలో పరిస్థితులను తాను అర్ధం చేసుకోగలననీ, అయితే తన మీద ఒత్తిడి ఉన్న మాట వాస్తవమేననీ, అయితే నాయకులు, జనసైనికులు, వీర మహిళల అభిప్రాయాలను గౌరవిస్తానని అన్నారు. సరైన నిర్ణయం తీసుకోవడానికి ఒకటి రెండు రోజులు సమయం అవసరమని తెలిపారు.
ఈ సమావేశం జరిగిన మరుసటి రోజే (ఇవేళ) పవన్ కళ్యాణ్ తో కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషణ్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ లు పవన్ కళ్యాణ్ కార్యాలయానికి వెళ్లి తెలంగాణ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసే అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జనసేన తెలంగాణ నేతల మనోగతాన్ని బీజేపీ నేతలకు పవన్ కళ్యాణ్ వివరించారు. గతంలో బీజేపీ అగ్రనేతల కోరిక మేరకు హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికల నుండి విరమించుకుని బీజేపీ అభ్యర్ధుల విజయానికి కృషి చేశామనీ, ఇప్పుడు కనీసం 30 స్థానాల్లో అయినా పోటీ చేయకపోతే కార్యకర్తల స్థైర్యం దెబ్బతింటుందని తెలంగాణ జనసేన నాయకులు చెబుతున్న విషయాన్ని కిషణ్ రెడ్డి, లక్ష్మణ్ లకు పవన్ కళ్యాణ్ వివరించారు.
పొత్తులో భాగంగా జనసేనకు బీజేపీ 30 స్థానాలు కేటాయించడం అంటే కష్టమేనని అంటున్నారు. తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన క్షేత్ర స్థాయిలో నిర్మాణం జరగలేదు కానీ కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్, అభిమానగణం బాగానే ఉందని అంటున్నారు. పలు కీలక నియోజకవర్గాల్లో జనసేన పార్టీ వెయ్యి నుండి పది వేల ఓట్ల వరకూ సాధించగల సత్తా ఉండటంతో అక్కడ అభ్యర్ధుల గెలుపు ఓటములపై ప్రభావం చూపగలరు.
దీంతో బీజేపీ నేతలు జనసేనను పూర్తిగా పక్కన పెట్టే పరిస్థితి అయితే లేదు. ఈ సారి కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండా మద్దతు ఇవ్వాలని జనసేన అధినేతపై బీజేపీ అధిష్టానం నుండి ప్రతిపాదన రావడంతో ఏమి చేయాలో పాలుపోని స్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నారని అంటున్నారు. తెలంగాణ ఎన్నికల విషయంలో బీజేపీ, జనసేన ఏ విధంగా ముందుకు సాగుతాయి అనే విషయం తెలియాలంటే మరో నాలుగైదు రోజులు ఆగాల్సిందే.
Supreme Court: సుప్రీం కోర్టులో ఏపీ సర్కార్ కు మరో సారి చుక్కెదురు