YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం.. అవినాష్ పిటిషన్ పై నేటి మధ్యాహ్నం తర్వాత విచారణ చేపట్టి ఇరువర్గాల వాదనలు విన్నది. అవినాష్ రెడ్డిని అరెస్టు చేయనున్నారా అని ధర్మాసనం సీబీఐని ప్రశ్నించగా, సీబీఐ తరపు న్యాయవాది అవసరమైతే అరెస్టు చేస్తామని తెలిపారు. హైకోర్టు లో ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాదనలు జరుగుతున్న నేపథ్యంలో అవినాష్ రెడ్డి ఇవేళ సీబీఐ విచారణకు హజరు కాలేదు.

అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది పలు కీలక విషయాలను ప్రస్తావించారు. కేవలం దస్తగిరి ఇచ్చిన కన్పెషన్ స్టేట్ మెంట్ తప్ప సీబీఐ దగ్గర అవినాష్ కు వ్యతిరేకంగా ఎలాంటి అధారాలు లేవని, పైగా దస్తగిరిని కూడా బెదిరించి ఆ స్టేట్ మెంట్ తీసుకుందని అవినాష్ తరపు న్యాయవాది వాదించారు. వివేకా హత్య కేసులో భాస్కరరెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారనీ, భాస్కరరెడ్డి పిటిషన్ పెండింగ్ లో ఉండగానే అరెస్టు చేశారని చెప్పారు. ఆయనను అరెస్టు చేయడానికి దస్తగిరి వ్యాంగ్మూలం తప్ప సీబీఐ వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నారు. దస్తగిరిని బెదిరించి చిత్రహింసలకు గురి చేసినట్లు ఎర్ర గంగిరెడ్డి చెప్పాడన్నారు. దస్తగిరి కూడా సీబీఐకి భయపడి భాస్కరరెడ్డి, అవినాష్ రెడ్డి లకు వ్యతిరేకంగా వ్యాంగ్మూలం ఇచ్చారన్నారు. వివేకా హత్యకు నాలుగు కారణాలు ఉన్నాయనీ, ఒకటి కుటుంబం, రెండోది వ్యాపార సంబంధాలు, మూడోది వివాహేతర సంబంధాలు, నాల్గోవది పొలిటికల్ గెయిన్ అని పేర్కొన్నారు. వీటిపై సీబీఐ ఫోకస్ పెట్టలేదన్నారు.
అలాగే అవినాష్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీసే కుట్ర జరుగుతోందని, రాజకీయ కోణంలో భాస్కరరెడ్డి, అవినాష్ రెడ్డిలను ఇరికించే కుట్రలో భాగమే ఇదంతా అని అవినాష్ తరపు న్యాయవాది వాదించారు. మరో పక్క వివేకా కుమార్తె సునీతా రెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ ను స్వీకరించిన నేపథ్యంలో అవినాష్ పిటిషన్ పై రేపు ఉదయం మరో సారి విచారణ జరపాలని హైకోర్టు నిర్ణయించింది. అవినాష్ రెడ్డిని రేపు సాయంత్రం విచారణకు పిలవాలని సీబీఐకి ధర్మాసనం సూచించింది. కోర్టు సూచనల మేరకు అవినాష్ రెడ్డిని రేపు సాయంత్రం 4 గంటలకు విచారించేందుకు సీబీఐ అంగీకారం తెలిపింది. అనంతరం తదుపరి విచారణను రేపటికి ధర్మాసనం వాయిదా వేసింది. దీంతో రేపు మధ్యాహ్నం లోపు అవినాష్ రెడ్డి పిటిషన్ పై తీర్పు వెలువడే అవకాశం ఉంది.
జగన్ పై హత్యాయత్నం కేసు విచారణ ఈ నెల 20కి వాయిదా..జగన్ తరపు న్యాయవాది వాదనలు ఇలా..