మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ కు తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. సునీల్ యాదవ్ కు బెయిల్ ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. సునీల్ యాదవ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. సునీల్ యాదవ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ తో పాటు సీబీఐ, వైఎస్ సునీతా వేసిన ఇంప్లీడ్ పిటిషన్లపైనా హైకోర్టులో సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. ఆర్టికల్ – 21 ప్రకారం వ్యక్తిగత స్వేచ్చ హరిస్తున్నారని, చార్జిషీటు దాఖలు చేసినప్పటికీ ఇంకా జైలులో ఉంచాల్సిన అవసరం లేదని సునీల్ తరపున న్యాయవాది నయన్ కుమార్ వాదించారు.

వివేకా హత్య కేసులో సునీల్ కు సంబంధం లేదనీ, ఓ మహిళ హనీ ట్రాప్ తో జరిగిందని అతని తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తన మామకు వివాహేతర సంబంధాలు ఉన్నాయనీ, ఓ మహిళకు రూ.8 కోట్లు ఇచ్చారని వివేకా అల్లుడే పోలీసులకు వాంగ్యూలం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ రెండు రాజకీయ గ్రూపుల మధ్య పోరులో సునీల్ యాదవ్ చిక్కుకున్నారని చెప్పారు. చార్జిషీటు వేసిన తర్వాత కూడా ఇంకా జైలులో పెట్టాల్సిన అవసరం లేదనీ, ఇది వ్యక్తిగత స్వేచ్చను హరించడమేనని వాదించారు. ఏపి రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేసినప్పుడు సునీల్ యాదవ్ పేరు ఎక్కడా లేదనీ, సీబీఐ సాక్షిగా వాంగ్మూలం సేకరించి ఉన్నట్టుండి నిందితుడిగా పేరు చేర్చి అరెస్టు చేసిందని తెలిపారు. సీబీఐ దర్యాప్తునకు పూర్తిగా తన క్లైయింట్ సహకరిస్తున్నారనీ, బెయిల్ ఇచ్చి అవసరమైతే ఏపికి వెళ్లకూడదని షరతు విధించాలని సునీల్ తరపు న్యాయవాది హైకోర్టును కోరారు.
మరో వైపు .. వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ కు బెయిల్ ఇవ్వొద్దని హైకోర్టును సీబీఐ కోరింది. హత్యలో రాజకీయ పెద్దల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోందని హైకోర్టుకు తెలిపింది. హత్యకు ముందు, ఆ తర్వాత సునీల్ యాదవ్ అనుమానిత రాజకీయ నేతలతో కలిసి ఉన్నట్లు గూగుల్ టేక్ అవుట్ ద్వారా గుర్తించినట్లు సీబీఐ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేంద్రన్ హైకోర్టుకు వివరించారు. సునీల్ యాదవ్ కు బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారనీ, సాక్షులను బెదిరిస్తారన్నారు. సునీల్ యాదవ్ ఇతర నిందితులతో కలిసి చేసిన కుట్రను అప్రూవర్ గా మారిన దస్తగిరి, వాచ్ మెన్ రంగయ్య స్పష్టంగా వాంగ్మూలం ఇచ్చారని తెలిపారు.
వివేకా సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత తరపు సీనియర్ న్యాయవాది ఎల్ రవిచందర్ వాదనలు వినిపించారు. సునీల్ యాదవ్ రెండు రాజకీయ గ్రూపుల మధ్య చిక్కుకున్న సాధారణ వ్యక్తి కాదనీ, హత్య లో పాత్ర ధారిగా, సూత్ర ధారిగా వ్యవహరించారని వాదిస్తూ, ఇప్పటికే ఈ కేసులో పలువురు సాక్షులు ప్రభావితమయ్యారనీ, కుట్రలో భాగమైన ఇతరుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతున్నందున సునీల్ కు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. మొత్తం వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ సుమలత . సునీల్ బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ తీర్పు వెల్లడించారు. సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్నందున ప్రస్తుత దశలో బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. నిందితుల వ్యక్తిగత స్వేచ్చ ముఖ్యమే అయనప్పటికీ నిష్పక్షపాత దర్యాప్తు, సాక్షుల భద్రత అంతకంటే ప్రధానమని హైకోర్టు తెలిపింది.
ఏపి సర్కార్ కు సుప్రీం కోర్టులో మరో సారి చుక్కెదురు.. అమరావతి పిటిషన్లపై మార్చి 28న విచారణ