మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. కేసు దర్యాప్తు చివరి దశకు చేరుకోగా ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిని సైతం అరెస్టు చేయడానికి సిద్దం అవుతోంది. ఈ తరుణంలో తెలంగాణ హైకోర్టు ఇవేళ ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన మద్యంతర పిటిషన్లపై ఈరోజు తెలంగాణ హైకోర్టు తీర్పును వెల్లడించనున్నది. సీఆర్పీసీ 160 సెక్షన్ ప్రకారం తనపై కఠిన చర్యలు తీసుకోవద్దన్న అవినాష్ రెడ్డి అభ్యర్ధనపై కూడా హైకోర్టు నేడు ఉత్తర్వులు ఇవ్వనున్నది. అదే విధంగా పిటిషన్ పై పూర్తి విచారణ ముగిసే వరకూ తనను సీఆర్పీసీ 160 సెక్షన కింద తదుపరి విచారణ జరగకుండా స్టే ఇవ్వాలంటూ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన మద్యంతర అభ్యర్ధనపైనా హేకోర్టు ఆదేశాలు ఇవ్వనున్నది.

వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి సిబీఐ దర్యాప్తు పారదర్శకంగా జరగడం లేదనీ, తన విచారణ సందర్భంలో న్యాయావాదిని అనుమతించాలని, తన స్టేట్ మెంట్ ప్రతిని తనకు ఇవ్వాలని అవినాష్ రెడ్డి ఇటీవలే కోర్టును కోరారు. అంతే కాకుండా విచారణ సమయంలో ఆడియో, వీడియో రికార్డింగ్ ను కూడా చేయాలని ఆయన హైకోర్టును కోరారు. అయితే అవినాష్ రెడ్డి ఆరోపణలను సీబీఐ ఖండించింది. ఆడియో, వీడియో రికార్డులు కూడా ఉన్నాయని సీబీఐ కోర్టుకు తెలిపింది. తీర్పు వెల్లడించే వరకూ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయవద్దని సీబీఐ అధికారులను ఆదేశించిన హైకోర్టు .. తీర్పు రిజర్వు చేసిన సంగతి తెలిసిందే. ఇవేళ ఉదయం 10.30 గంటలకు కోర్టు తీర్పు ఇవ్వనున్నది. మరో పక్క వైఎస్ వివేకా హత్య కేసులో దస్తగిరిని అప్రూవర్ గా అనుమతించాన్ని తప్పుబడుతూ వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
సీబీఐ కుట్రపూరితంగా దర్యాప్తు చేస్తొందని కృష్ణారెడ్డి ఆరోపించారు. దస్తగిరి అప్రూవర్ గా మారుస్తూ కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని ఆయన తెలంగాణ హైకోర్టును కోరారు. అయితే కృష్ణారెడ్డి పిటిషన్ పై సీబీఐ అభ్యంతరం తెలిపింది. ఇదే విషయంపై గతంలో దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసిందని సీబీఐ తెలిపింది. కావున దస్తగిరి అప్రూవర్ అంశంపై కృష్ణారెడ్డికి పిటిషన్ దాఖలు చేసే అర్హత లేదని సీబీఐ వాదించింది. ఈ పిటిషన్ విచారణ అర్హతపై సోమవారం పూర్తి స్థాయి వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. ఈ పరిణామాల క్రమంలో అవినాష్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభిస్తుందా.. సీబీఐకి అనుకూలంగా తీర్పు వెలువడుతుందా అన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొని ఉంది. కొద్ది గంటల్లో దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
నేడు ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ .. ఈ కీలక అంశాలపైనే చర్చ..?