ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే నాయకుడు చంద్రబాబు చేయలేని పనిని ఆయన అనుభవం అంత లేని వయసు నాయకుడు జగన్ చేసి చూపించారు. ఇది ఆయన తెగింపునకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. టీడీపీ తరపున గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ బాబు, మద్దాలి గిరిధర్ రావు వైసీపీకి జై కొట్టారు. నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా వారిపై పార్టీ పరంగా సస్పెన్షన్ వేటు వేయలేదు చంద్రబాబు. దీంతో వారు అసెంబ్లీలో అధికారికంగా టీడీపీ సభ్యులుగానే ఉన్నారు. వారి నియోజకవర్గాల్లో వైసీపీ సమన్వయకర్తలుగా కొనసాగుతున్నారు. అయితే వీరిని చంద్రబాబు పార్టీ నుండి సస్పెండ్ చేయలేకపోయారు. అంటే దానికి ఒక కారణం ఉంది.

ప్రతిపక్ష హోదా పోతుందని
ఆ నలుగురిని పార్టీ నుండి చంద్రబాబు సస్పెండ్ చేస్తే వారు స్వతంత్ర ఎమ్మెల్యేలుగా కొనసాగుతారు. అధికారికంగా వైసీపీలో చేరే అవకాశం ఏర్పడుతుంది. వారు స్వతంత్ర సభ్యులు అయితే అసెంబ్లీలో టీడీపీ బలం 23 నుండి 19కి పడిపోతుంది. పర్వవసానంగా చంద్రబాబుకు ఉన్న ప్రతిపక్ష నాయకుడి హోదా పోతుంది. దీనికి భయపడే చంద్రబాబు ఆ స్టెప్ తీసుకోలేదని అంటారు. ఇదే విషయాన్ని ఇటీవల వల్లభనేని వంశీ కూడా తెలిపారు. తమను పార్టీ నుండి సస్పెండ్ చేస్తే ఆయన (చంద్రబాబు) కు ప్రతిపక్ష నాయకుడి హోదా పోతుందని అందుకే సస్పెండ్ చేయడం లేదని అన్నారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని జగన్మోహనరెడ్డి .. ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుండి నిర్మోహమాటంగా ఎటువంటి వివరణ అడగకుండానే సస్పెండ్ చేసేశారు. ఇది నిజంగా డేరింగ్ స్టెప్ అనాల్సిందే. ఎందుకంటే..

ముగ్గురు ఒకే సామాజికవర్గం నేతలు
వైసీపీ సస్పెండ్ చేసిన ఎమ్మెల్యేల్లో ముగ్గురు తన సామాజికవర్గానికే చెందిన వారు కావడంతో పాటు సీనియర్ నేతలు. ఒకరు మాత్రమే జూనియర్ ఎమ్మెల్యే. పార్టీ కట్టుదాటితే ఎంతటి సీనియర్ లు అయినా, బ్లంట్ ఫాలోవర్స్ అయినా ఉపేక్షించేది లేదు అన్న సంకేతం ఇచ్చారు సీఎం జగన్. ప్రస్తుతం పార్టీ బహిష్కరణకు గురైన వారిలో అనం రామనారాయణరెడ్డి అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ, కాంగ్రెస్ హయంలో వివిధ శాఖల మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించారు. ఇక మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వీరు నెల్లూరు జిల్లాలోని రెండు మూడు నియోజకవర్గాల్లో పార్టీ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా క్యాడర్ ఉన్న నాయకులు. వీరి తర్వాత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు దివంగత వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయులు. ఆ కారణంగా జగన్మోహనరెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆయనకు మద్దుతుగా మేకపాటి చంద్రశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2012 ఉప ఎన్నికల్లో విజయం సాధించారు.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ ఆవిర్భావం నుండి క్రియాశీలకంగా పని చేశారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి 20వేల పైచిలుకు మెజార్టీతోనే విజయం సాధించారు. ఈ ముగ్గురితో పాటు తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఉండవల్లి శ్రీదేవి మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. ఈ చర్యలతో పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఎటువంటి మొహమాటాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్న సంకేతం ఇచ్చినట్లు అయ్యింది. చంద్రబాబుకు, జగన్ కు మధ్య తేడా ఇదీ. నలుగురు ఎమ్మెల్యేలు కట్టుదాటినా పార్టీ పరంగా చంద్రబాబు చర్యలు అయితే తీసుకోలేదు కానీ జగన్మోహనరెడ్డి మాత్రం నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసేశారు. అందుకే ఈ విషయంలో ‘దటీజ్ జగన్’ అనాల్సిందేగా..!
MLA Sridevi: ‘జగన్ దెబ్బకు మైండ్ బ్లాక్ అయ్యింది’