Eatela Rajendar: తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి పదవి నుంచి ఇటీవలే అనూహ్యంగా తొలగింపునకు గురైన టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత ఈటల రాజేందర్ ఎపిసోడ్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. భూ కబ్జాల ఆరోపణలు ఎదుర్కున్న ఆయన ఉదంతం వలే మరో మంత్రికి సైతం షాక్ ఎదురైంది. అందులోనూ సదరు మంత్రి కూడా ఆరోగ్య శాఖ బాధ్యతలు నిర్వర్తించిన వారే కావడం ఆసక్తికరం. అయితే, సదరు మంత్రిపై అలాంటి ఆరోపణలు ఏవీ లేవు.
అంతా ప్రశంసలు… అయిన వాళ్ల చిన్నచూపులు…
భారతదేశంలో పరిపాలనలో ఆదర్శం అనే విషయంలో పలు సందర్భాల్లో కమ్యూనిస్టుల పాలనలో ఉన్న కేరళను ఉదహరించే సంగతి తెలిసిందే. భారత్‌లో కరోనా కట్టడిలో కేరళ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది.. దీని వెనుక సీఎం పినరయి విజయన్‌తో పాటు.. ఇప్పటి వరకు ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న కేకే శైలజ కృషి ఎంతో ఉంది. అయితే, ఆమెకు ఈ సారి కేబినెట్లో మాత్రం చోటు దక్కలేదు.రెండోసారి వరుసగా కేరళలో అధికారంలోకి వచ్చిన ఎల్డీఎఫ్ కూటమి ప్రభుత్వంలో కేకే శైలజకు మంత్రి పదవి అందకుండా పోయినట్టు తెలుస్తోంది.
షాక్ కదా?
కేరళ ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న కేకే శైలజ కరోనా కట్టడిలో విశేష కృషి చేశారు. దానికి తగ్గట్టుగానే ఆమెకు వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి, ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. ఇక రాజకీయాల విషయానికి వస్తే, తాజాగా జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు శైలజా టీచర్.. మత్తన్నూర్ నియోజకవర్గం నుంచి ఏకంగా 60 వేల మెజార్టీతో తిరుగులేని విజయాన్ని నమోదు చేశారు. కానీ, ఆమెకు కమ్యూనిస్టు నేతలు మాత్రం తిరిగి బెర్తు ఇవ్వకపోవడం సహజంగానే చర్చనీయాంశంగా మారింది.