Tirupati By election: టీడీపీ అధినేత చంద్రబాబు Chandra babu తనపై రాళ్ల దాడి జరిగిందంటూ పెద్ద డ్రామా చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి Peddireddy ramachandra reddy విమర్శించారు. సోమవారం తిరుపతి ఎన్నికల ప్రచారంలో ఉన్న చంద్రబాబు వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై భైటాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎస్పీ కార్యాలయానికి చంద్రబాబు చేరుకోగా అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. ఎఎస్పీ బయటకు వచ్చి చంద్రబాబుతో మాట్లాడగా ఫిర్యాదు అందజేశారు. రాళ్ల దాడిలో టీడీపీకి చెందిన పది మందికి గాయాలు అయ్యాయి. ఈ ఘటనను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు.

ఈ ఘటనపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందిస్తూ ఓటమి భయంతోనే చంద్రబాబు హైడ్రామా చేస్తున్నారని విమర్శించారు. రాళ్ల దాడి జరిగిన వెంటనే సీఎంపై ఆరోపణలు చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు పెద్దిరెడ్డి. దిగజారుడు రాజకీయాలు వైసీపీ ఎప్పటికీ చేయదన్నారు. చచ్చిన పామును కర్రతో కొట్టాల్సిన అవసరం ఏముందన్నారు. మామపైనే చెప్పులు వేయించిన ఘనత చంద్రబాబుదనీ అలాంటి అలవాటు జిల్లాలో ఎవరికీ లేదన్నారు. 45 నిమిషాల పాటు చంద్రబాబు ప్రసంగిస్తున్నప్పుడు వేయని రాళ్లు ప్రసంగం చివరలో వేస్తారా అని ప్రశ్నించారు.
ఘటన జరిగిన వెంటనే గవర్నర్ అపాయింట్ మెంట్ కోరినట్లు వార్తలు వచ్చాయనీ, దీన్ని బట్టి చూస్తే పథకం ప్రకారం చేసినట్లు తెలుస్తోందన్నారు. గాయపడిన వారిని చూపించలేదనీ, ఇది కేవలం డ్రామా మాత్రమేనని పెద్దిరెడ్డి అన్నారు. రాయి వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తాము కోరుతున్నామనీ, దీన్ని చంద్రబాబు చేయించి ఉంటే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరతామన్నారు. చంద్రబాబు సంస్కారం లేని వ్యక్తి అని గతంలో అమిత్ షాపై రాళ్ల దాడి చేయించిన ఘనత చంద్రబాబుదని పెద్దిరెడ్డి విమర్శించారు.