Road Accident: నల్లమల ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీశైలం వెళతున్న టూరిస్టు బససు నల్లమల ఘాట్ రోడ్డులో బొల్తా కొట్టడంతో ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. అనేక మందై కాళ్లు చేతులు విరిగిపోయాయి. గాయపడిన వారిని వెంటనే పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. శ్రీశైలం మల్లన్న దర్శనానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సండ్రుగుండ గ్రామానికి చెందిన 20 మంది భక్తులు టూరిస్ట్ బస్సులో వెళుతుండగా శ్రీశైలం శిఖరానికి అయిదు కిలో మీటర్ల దూరంలో నల్లమల ఘాట్ రోడ్డు చిన్నారుట్ల దయ్యాల మలుపు వద్ద బస్సు వేగంగా వచ్చి అదుపుతప్పి బొల్తా కొట్టింది. ఆ సమయంలో బస్సులో 20 మంది భక్తులు ఉండగా, పది మందికి కాళ్లు చేతులు విరిగి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే ఆలయ ఏఈఓ పణిదారు ప్రసాద్, శ్రీశైలం సీఐ, ఎస్ సిబ్బందితో అక్కడకు చేరుకుని క్షతగాత్రులను శ్రీశైలం దేవస్థానం ఆసుపత్రికి, మరి కొందరిని సుండిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
ప్రమాదం జరిగిన ప్రదేశంలో గతంలోనూ చాలా సార్లు ప్రమాదాలు జరగినా అధికారులు ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవడం లేదని భక్తులు మండిపడుతున్నారు. బస్సు ప్రమాదం జరిగిన ప్రదేశానికి రెండు అడుగుల దూరంలో సుమారు వంద అడుగుల లోయ ఉంది. అందులోపడి ఉంటే తీవ్ర ప్రమాదం జరిగేదని అంటున్నారు. బస్సు డ్రైవర్ మలుపులను అంచనా వేయకుండా అతి వేగంగా రావడమే ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.