విశాఖపట్నంలో విషాదం చోటుచేసుకుంది. ఓ పాత మూడు అంతస్తుల భవనం కుప్పకూలిపోవడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటన విశాఖ నగరంలోని రామజోగిపేటలో జరిగింది. ఈ దుర్ఘటనలో మరో అయిదుగురు తీవ్రంగా గాయపడగా, వారిని కేజిహెచ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే .. రామజోగిపేటలోని మూడు అంతస్తుల భవనం వేకువజామున ఒక్క సారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో అన్నా చెల్లిళ్లు అయిన దుర్గాప్రసాద్, అంజలి, చోటు అనే వ్యక్తి మృతి చెందారు.

ఈ ఘటనలో సాకేటి రామారావు, సాకేటి కల్యాణి, కొమ్మిశెట్టి శివశంకర, సాతిక రోజారాణి, సున్నపు కృష్ణలు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలిసిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టారు. శిధిలావ కింద చిక్కుకున్న వారిని ఎన్డీఆర్ఎఫ్, అగ్ని మాపక సిబ్బంది వెలికి తీసి ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తొంది. భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో పరిసర ప్రాంతాలకు చెందిన వారు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని డీసీపీ సుమిత్ గరుడ పరిశీలించారు. ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు ఆర్డీవో హుస్సేన్ మీడియాకు తెలిపారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చిన్నారి అన్నా చెల్లిళ్లు ఈ ప్రమాదంలో మృతి చెందడం, వారి తల్లిదండ్రులు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటం చూపరుల హృదయాలను కలచివేసింది.