ఏపిలో రాజధాని అంశం హాట్ హాట్ గా ఉంది. ఓ వైపు ఏపి హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. రాజధాని అంశం సుప్రీం కోర్టు విచారణలో ఉంది. వైసీపీ నేతలు మాత్రం తమ పార్టీ విధానం, తమ ప్రభుత్వ విధానం మూడు రాజధానులు, పరిపాలనా వికేంద్రీకరణ అని పదేపదే చెబుతున్నారు. ప్రభుత్వం ఉప సంహరించుకున్న పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను మరల అసెంబ్లీలో పెడతామన్న ప్రభుత్వం ఇంత వరకూ ప్రవేశపెట్టలేదు. సుప్రీం కోర్టు నుండి అనుకూలంగా గానీ వ్యతిరేకంగా గానీ తీర్పు ఇంకా వెలువడక ముందే అధికార పక్ష నేతలు మాత్రం త్వరలో విశాఖ నుండే పరిపాలన, విశాఖ పరిపాలనా రాజధాని అంటూ ప్రకటిస్తూనే ఉన్నారు.

తాజాగా నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌యే స్వయంగా ఢిల్లీ వేదికగా త్వరలో విశాఖ రాజధానిగా పాలన సాగుతోందని, తాను మకాం అక్కడికి మార్చనున్నట్లు కీలక ప్రకటన చేశారు. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై తీర్పు వెలువడక ముందే స్వయంగా సీఎం ప్రకటన చేయడంపై ఆక్షేపణలు, అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. సుప్రీం కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుండగా, ముఖ్యమంత్రి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కు లేఖ రాశారు. అధికార వైసీపీ మినహా ఇతర రాజకీయ పక్షాలు అన్నీ అమరావతిలోనే రాజధాని కొనసాగాలని కోరుకుంటున్నాయి. కాగా త్వరలో తాను విశాఖ నుండి పరిపాలన కొనసాగించనున్నట్లు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించిన గంటల వ్యవధిలోనే, విశాఖ నుండి పరిపాలన ఎప్పటి నుండి అనే అంశంపై క్లారిటీ ఇచ్చేశారు వైసీపీ కీలక నేత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.

ఏప్రిల్ లోపే విశాఖ నుండి పాలన ఉంటుందని చెప్పారు వైవీ సుబ్బారెడ్డి. విశాఖలో అనేక ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉన్నాయనీ, అవసరమైతే ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకుంటామని తెలిపారు. భీమిలి రోడ్డులోనే చాల ప్రభుత్వ ప్రాపర్టీలు, ఈటీ భవనాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. విశాఖలోని ఏపి ప్రభుత్వ గెస్ట్ హౌస్ నుంచైనా సీఎం జగన్ పాలన సాగించవచ్చని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. పరిపాలనా రాజధానిగా విశాఖ అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాము ఎప్పటి నుండో చెబుతున్నామనీ, వీలైనంత త్వరగా న్యాయపరమైన చిక్కులు అధిగమిస్తామని తెలిపారు.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే గతంలో గవర్నర్ ఆమోదించిన పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులలో లోపాలు ఉండటం (శాసనమండలిలో బిల్లు ఆమోదం పొందకపోవడం, రాష్ట్రపతి పరిధిలోని హైకోర్టు మార్పు అంశాన్ని వారి అనుమతి లేకుండా బిల్లులో పెట్టడం వంటి) వల్లనే న్యాయవ్యవస్థ తప్పుబట్టే అవకాశం ఉన్నందున ఆ బిల్లులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆ తరుణంలోనే న్యాయపరమైన చిక్కులు రాకుండా మెరుగైన విధంగా వికేంద్రీకరణ బిల్లు తీసుకువస్తామని సీఎం జగన్మోహనరెడ్డి అసెంబ్లీలోనే తెలిపారు. ప్రభుత్వం ఆ బిల్లులను ఉపసంహరించుకున్న దృష్ట్యా సుప్రీం కోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని, ఆ వెంటనే అసెంబ్లీలో పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు ఆమోదింపజేసుకుని ముందుకు వెళ్లాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని ప్రస్తుత చర్యలను బట్టి చూస్తే అందరికీ అర్ధం అవుతోంది.