వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి మరో సారి అస్వస్థతకు గురైయ్యారు. మర్రిపాడులోని తన నివాసంలో ఉండగా ఆయనకు గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే వైద్యులను ఇంటికి పిలిపించారు. ఇంటిలోనే ఆయనకు చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం మేకపాటిని చెన్నై తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

గత నెలలో కూడా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు వచ్చింది. అప్పుడు రెండు వాల్వ్ లు బ్లాక్ అయినట్లు వైద్యులు గుర్తించి చికిత్స అందించడంతో ఆయన కోలుకున్నారు. అంతకు ముందు 2021 డిసెంబర్ నెలలోనూ చంద్రశేఖర్ రెడ్డి గుండెపోటుతో అస్వస్థతకు గురైయ్యారు. అప్పుడు బెంగళూరుకు తరలించి సర్జరీ చేసి స్టెంట్ వేసిన సంగతి తెలిసిందే. రెండు సార్లు గుండె పోటుకు గురై చికిత్సల ద్వారా కోలుకుంటున్న ఆయనకు తాజా రాజకీయ పరిణామాలు టెన్షన్ తెప్పిస్తున్నాయి.
ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారన్న అభియోగంతో పార్టీ అధిష్టానం ఆయనను సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేకపాటి వర్గం, వైసీపీ శ్రేణుల మధ్య మాటల యుద్ధం, సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు. ఉదయగిరికి వస్తే తమిరేస్తామంటూ వైసీపీ శ్రేణులు సవాల్ చేయడంతో నిన్న సాయంత్రం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నేరుగా ఉదయగిరి బస్టాండ్ దగ్గరకు వెళ్లారు. అక్కడ రోడ్డుపై కుర్చీ వేసుకుని, ఎవరో తరిమేస్తానన్న వాళ్లు రావాలంటూ సవాల్ విసిరారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మేకపాటి చంద్రశేఖరరెడ్డి రెండు సార్లు కాంగ్రెస్ తరపున, రెండు సార్లు వైసీపీ తరపున ఉదయగిరి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం వైసీపీ నుండి సస్పెండ్ అయినందున స్వతంత్ర ఎమ్మెల్యేగా కొనసాగుతున్నట్లు ఇటీవల పేర్కొన్నారు.
టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత ..వైఎస్ఆర్‌టీపీ కార్యకర్తలతో సహా వైఎస్ షర్మిల అరెస్టు